పెద్దాపురం చరిత్ర పద్యం
-------------------------------
అయ్యా వినండి ఘన చరితం
పెద్దపురమను మన చరితం
సూర్య వంశోద్భావులు ఆంధ్ర క్షత్రియులు
దుర్జయుడే మా మూల పురుషుడు
పెదపాత్రుడు మా పెద్దయ్య
నిర్మిచెను మా నగరమయా
కృష్ణా జిల్లా కాండ్రపాడు లో
కొలువు దీరెను కోటకట్టుకుని
గుడిమెట్టలోన గుఱ్ఱము తోడ్కొని
భీమ కవీషుని శాపము గైకొని
స్వర్గము కేగిన సాగి పోతన్న
మా పూర్వులలో ఒకడన్న
తెలుంగు రాయుడు తెగువ చూపెను
భీమ కవీశుడే చెలిమి చేసెను
వరాహ వధను విరమణ చేసి
నృశింహ పురాణమంకితమిచ్చెను
వీరి మనుమడే రామరాజన్న
రాజథానేమో వత్సవాయన్న
రాజ శేఖరుల మనోభీష్టమున
రాజధానాయె గృహనామం
పరిసరమందలి పాలకుల ద్రోలి
పెద్దాపురమున కోటగట్టిన
తిమ్మ శిఖామణి తేజరిల్లెను
షేరు మహమ్మదు ఛత్రమునొంది
రాజాధి రాజు రమ్య బిరుదాశాలి
రాయరాజపరాజు రాజ జగపతి రాజు
గెలిచే అవలీలగా చాల ధుర్గాలు
నీరాజనాలిచ్చే నానా నవాబులు
సార్వభౌమ తిమ్మ యుద్ధపటిమ
ధుగరాజు మొదలైన దొరల భంగించి
విశ్వంభరుని జేసె యుద్దవిరతు
జాపరల్లి వింధ్యగిరినవశేషమున్ చేయ
వెంకాంబ కుమరుండు ఉద్భవించేను
ఘనరాజ మండలనిరోధమ్ము చేసి
ఉద్దండ రాయుడై ఉద్ధరించేను
మైనరాయెను గనుక
ముగ్గురు కుమారులు
తిమ్మ జగపతి పేర
రాజ్య పాలన చేసే రాఘవమ్మ
రుస్తుం ఖానుండి కపటోపాయం
వత్సవాయ వంశమునకపాయం
అంతః పుర స్త్రీలగ్నికి ఆహుతి
బాల జగపతికి జైలు దుర్గతి
విజయనగరపు రాజు విజయరామ రాజు
అందించే తోడ్పాటు అవసరముగా
హాజీ హుస్సేను హతాసుడాయెను
నూరుద్దీన్ ఖాన్ నెత్తురొడ్డేను
బాల జగపతే రాజ జగపతై
పాలించే పురమును జనరంజకముగా
విధ్వత్తిమ్మపతి విధ్వత్తు తోడ
సంస్థాన పాలనము చక్కగాను
మలి రాయ జగపతి పొందే సన్నద్దు
ఇంగ్లీషు కుంఫిణీ ఇష్ట కార్యార్ధం
లేక కుమారులు రాయ జగపతికి నాడు
కుంఫిణీ రగిలించే కుంపట్లు కొలువులో
జగన్నాధ రాజడిగె రాజ్యాధికారం
లక్ష్మీ నరసాయమ్మ తెలిపే ధిక్కారం
బంగారు మా తల్లి బుచ్చి సీతాయమ్మ
అన్న సత్రాలెన్నో కట్టించె ఆశువుగా
త్రవ్వించె తటాకము తెలివి తోడ
నేటికీ నిలెచెనవి
రాయ జగపతి వర్మ రచియించె రుచిగా
పెద్దాపుర సంస్థాన చరితమిదియె
బ్రిటీషు కుంఫిణీ కంపు కార్యాలతో
రాజ్యాల రాజసం అంతరించేను
జమీను దారుల జల్సాల లోను
మేజువాణీల మోజు రివాజై
రోజు రోజుకీ జారిపోయెను
పెద్దాపురమే మారిపోయెను
ప్రతిభా వంతులు పేరు చెప్పక
ప్రగతి అన్నదే పారిపోయెను
కళలకు నెలవగు కళావంతులు
కత్తికి కట్టి పసుపు భాసికం
అంగడి వేలం కన్నెరికం
అతివ బతుకు ఇహలోక నరకం
వందేళ్ళ ఘన చరిత మున్సిపాలిటీ
వేశ్యాపురమన్న పాప్యులారిటీ
రాజకీయ నాయకుల కోతలు
రికార్డు డాన్సుల మోతలు
కోటేశ్వరరావు గారి క్లారిటీ
బచ్చు ఫౌండేషన్ వారి చారిటీ
ముప్పన వారిది హైస్కూలు
బ్రిటీషు వారిది ఒక స్కూలు
బచ్చు వారిదే ప్రతి అభివృద్ధి
చేయలేదయ్యా సర్కారు మీరేదీ
పేరుకి పెద్దది మా డివిజన్
ఏదయ్యా తమరి విజన్
గల్లీలన్నీ ఆట స్థలాలే
క్రీడాస్పూర్తే క్షీణిస్తే
యువత పరిస్థితి అధోగతే
పరిశుబ్రత పదమే కరవు
రోగాలకు ఆకరువు
రోగులు వేలు - పడకలు పదులే
ఏరియా ఆస్పత్రి అసలు స్థితి
అయ్యో ఆదిత్యా రోడ్డు
మృత్యువుతో బేటీ ఫ్రెండు
పాండవుల మెట్ట పాపముల పుట్ట
సూర్య భగవానుడే సాక్షీ భూతం
మరిడి మాతల్లి మౌనమే మళ్ళీ
ప్రజా పంపిణీ - మోసాల కుంఫిణీ
లేదు ఏ రేషన్ - అంతా పరేషాన్
దొరికితే 6A కేసు - లేకుంటే నువ్వే బాసు
విలేకర్లకూ వాటా ఉందోయ్
వీధికో సంఘం, గృహముకో గ్రూపు
ఆ సంఘం ఈ సంఘం
ఆ ఇజం ఈ ఇజం
అన్ని ఇజాల నిజానిజాలు
పోట్టకూటికే ప్రతి సంఘం
పేరుకి మాత్రం రణరంగం
కట్టమూరు లో బట్టీ సారాయి
ఖాకీలకు నేతి మిఠాయి
ఏనుగు లచ్చన్న
వేదుల సత్తన్న
వీర్రాజు ముప్పన
యాసలపు సూరన్న
మళ్ళీ పుట్టండన్న మన పెద్దాపురమున
వీర రాఘవమ్మ
లక్ష్మీ నరసాయమ్మ
బుచ్చి సీతాయమ్మ
పెద్దాడ కామమ్మ
మమ్ము నడపండమ్మ
వర్ణ చిత్రపు వెలుగు వాడిపోయేను
తోలుబొమ్మల కదలిక ఆగిపోయేను
సాముగరిడీ సచ్చి పోయేకదరా
దౌర్భాగ్య నాయకా చావవేమిరా
పెండలమనేటి పంటే మాయం
మెట్టలు మాయం గుట్టలు మాయం
మరుభూమి మాయం - మాయం
ఛీ .. మరుగు దొడ్దిలు ఖబ్జాలేనా ... ?
మర్లాం టు పెద్దాపురము
స్కూలు చేరగా చిన్న పిల్లలు -
తొక్కి సైకిలు పదిమైళ్ళు
తొక్కి తొక్కి తొడ తుక్కై పోయి
వెక్కి ఎడ్చుతూ అడిగే నేరుగా
ఏదీ మా బస్సు పల్లెకు
ఏంటి మీ స్టాండు చివరకు
మా బ్రతుకాయెను బస్టాండు
బస్టాండాయెను భోగం బజారు
ఊరంతా పెద్దలే
ఊరినిండా పేదలే