పెద్దాపురం - అంజలీదేవి జననం : 24-Aug-1928 - మరణం : 13-Jan-2014
అంజలీదేవి… పరిచయం అక్కరలేని పేరు. సీతమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో
అనిపించేలా నటించిన ఆమె దేశ విదేశాల్లో తిరిగినా, ఎంతో పేరు ప్రఖ్యాతులు
గడించినా తన స్వస్థలం పెద్దాపురం పేరు వింటే పులకించిపోతారు. స్వస్థలం
గురించి చెబుతున్నప్పుడు ఐదేళ్ల పసిపాపలా సంబరపడిన ఎనభైఐదేళ్ల అంజలీదేవి
ఊరి విశేషాలు ఆమె మాటల్లోనే…
“కన్నతల్లి, పుట్టినూరు – ఎవరి జీవితంలోనైనా ఎంతో ముఖ్యమైనవంటారు,
ఎప్పటికీ మరపురానివంటారు. కానీ నేను చిన్నప్పటి నుంచీ జన్మభూమికీ,
జన్మనిచ్చిన తల్లికీ దూరంగానే ఉండాల్సి వచ్చింది. బాల్యంలోనే కళాకారిణి
అయినందుకు సంతోషించాలో, అద్భుతమైన ఆటపాటల కాలాన్ని కోల్పోయినందుకు
బాధపడాలో అర్థం కాని పరిస్థితి నాది.
బొమ్మల పెళ్లిళ్లు
మాది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం. పూర్వం నుంచే అభివృద్ధి చెందిన
పట్టణం. 1928లో నేను అక్కడే పుట్టాను. మా అమ్మ సత్యవతి, నాన్న నూకయ్య.
నాకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. నా అసలు పేరు అంజనీకుమారి. సినిమా
రంగంలోకి వచ్చిన తరువాత అంజలీదేవిగా పేరు మార్చారు. సంతానంలో పెద్దదాన్ని
కావడంతో ఇంట్లో నాకు హక్కులు కొంచెం ఎక్కువగానే వుండేవి. మాది వ్యవసాయ
కుటుంబం.
కొంచెం పొలం ఉండేదనుకుంటా. మాకు మొన్నటి వరకూ అక్కడ ఇల్లు వుండేది.
ఇటీవలే దానిని అమ్మేశాం. మేమున్న వీధిలో ప్లీడర్లు ఎక్కువగా వుండేవారు.
అందుకే దానికి ప్లీడర్ వీధి అని పేరొచ్చింది. మా ఇంటి చుట్టూ బ్రాహ్మణ
కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. అందుకే నా స్నేహితురాళ్లంతా వారే ఉండేవారు.
జగదాంబ, మాణిక్యం అని ఇద్దరు స్నేహితురాళ్లు నాకు బాగా యిష్టం. మేమంతా
కలసి కొత్తకొత్త ఆటలు కనిపెట్టేవాళ్లం.
ఏదో ఒక పాత ఆట చూసి దానికి వెనుకాముందూ ఏవేవో జోడించి అదే కొత్త ఆటగా
ఆడేవాళ్లం. దాంతో మిగతావాళ్లు కొత్తకొత్త ఆటల కోసం మాదగ్గరకొచ్చేవాళ్లు.
ముఖ్యంగా బొమ్మల పెళ్లిళ్లు బాగా చేసేవాళ్లం. పెళ్లికొడుకు పెళ్లి కూతురు
బొమ్మలను అందంగా ముస్తాబు చెయ్యడం, పెళ్లి భోజనాలకు కావలసిన దినుసులన్నీ
సమకూర్చుకోవడం… వీటితో ఊపిరి తిరగనంత పని ఉండేది. బొమ్మల పెళ్లిళ్లలో
‘చెంగల గౌరీ…’ లాంటి పాటలు పాడేవాళ్లం. ఎనిమిదేళ్ల వయస్సులోనే ఇలాంటి
పాటలు బోలెడు వచ్చు నాకు. ఆడుకోవడమంటే నాకు చాలా ఇష్టం. మిగిలిన లోకం
పట్టేదే కాదు.
ఆంజనేయుడంటే ఇష్టం
అప్పట్లో బ్రాంచ్ గర్ల్స్ స్కూలు ఉండేది. అందులో నేను నాల్గవ తరగతి వరకూ
చదువుకున్నాను. మా ఇల్లు పెద్దాపురం మొదట్లోనే వుండేది. ఇంటి నుంచి
స్కూలుకు వెళ్లేటప్పుడు ప్రతిరోజూ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లేదాన్ని.
అప్పట్లో నాకు ఆ దేవుడంటే మహా ఇష్టం. అందుకే స్వామికి దండం పెట్టుకున్న
తర్వాతే బడికి వెళ్లేదాన్ని. ఆ మమకారంతోనే అనుకుంటా, ఆ స్వామివారు తరువాత
నన్ను తనకిష్టమైన జగజ్జనని సీత పాత్ర లో నటించే అవకాశం కల్పించారు.
మా ఊళ్లో ముప్పనాస్ వారి థియేటరుండేది. అందులో సినిమాలు, నాటకాలు
వేసేవాళ్లు. నేను కూడా ఎప్పుడన్నా వెళ్లి సరదాగా చూసి వచ్చేదాన్ని. నేను
నాలుగో తరగతి చదువుతున్న సమయంలో ఓ రోజు మా నాన్న స్కూలుకొచ్చారు.
రెక్కపట్టుకుని గబగబా ఈడ్చుకెళ్లినంత పని చేశారు. ఆయన ఎందుకలా
తీసుకెళ్తున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకర్థం కాలేదు. ముప్పనాస్
థియేటరు రిహార్సల్ గది వద్దకు తీసుకెళ్లి నన్ను నిలబెట్టేశారు.
అప్పటికి నాకసలు విషయం అర్థమైంది. భద్రాచార్యులవారు వేస్తున్న
హరిశ్చంద్ర నాటకంలో లోహితుడు పాత్రధారి రాలేదని ఆ వేషం కోసం నన్ను
తీసుకెళ్లారు. అది మగపిల్లాడి పాత్ర కావడంతో ఒక్కసారిగా నా జుట్టు
కత్తిరించేశారు. దాంతో నేను ఒకటే ఏడుపు. ఆ తరువాత రెండు రోజులు
రిహార్సల్స్ చేయించారు. హరిశ్చంద్ర నాటకంలో లోహితుడు చనిపోతాడు. అంటే
నేను స్టేజ్‌మీద కదలకుండా చనిపోయినట్లు పడుకోవాలి.
అలా కొద్దిసేపు పడుకునేటప్పటికి నేను నిద్రపోయాను. కొద్దిసేపటి తరువాత
ఎవరో నన్ను కదుపుతుంటే కళ్లు తెరిచాను. నా చేతిలో కర్పూరం పెట్టి
చంద్రమతి పాత్రధారి దానిని వెలిగించి నామీద పడి పెద్దగా ఏడుస్తోంది. ఆ
మంటతో నేను కాలిపోతానేమోనని భయమేసింది. కానీ చంద్రమతి వేషం వేసినావిడ
బాగా మేనేజ్ చేసింది. ఏదైతేనేం, ఆ రోజు లోహితుని పాత్రధారి రాకపోవడం నా
జీవితానికి కొత్త మలుపు అయింది.
జీవితం మారిపోయింది…
ఆ డ్రామా అయిపోయింది కానీ, ఆ తర్వాత నా జీవన శైలి మాత్రం మారిపోయింది. ఆ
రోజు నుంచీ ఆటలు పాటలు, స్నేహితురాళ్లతో తిరుగుళ్లు – అన్నీ ఆగిపోయాయి.
తెల్లవారేసరికి నాట్యం నేర్పే గురువుగారి దగ్గరకెళ్లాలి. సాయంత్రం మళ్లీ
నాట్యం. మధ్యలో సంగీత సాధన. ఇదే నా నిత్యకృత్యం. నాన్న తబలా వాయించేవారు.
ఆయనకు సంగీతమంటే భలే ఆసక్తి. నాకేమో ఆటలు తప్ప మరి దేనిమీదా ఇష్టముండేది కాదు. కానీ నాట్యం, సంగీతమంటూ మా నాన్న నన్ను తెగ విసిగించేవారు.
బహుశా!
1939లో అనుకుంటా మా క్లబ్ ఆధ్వర్యంలో ‘కుచేల’ డ్రామా వేశాం.
అందులో నాది రాఘవ పాత్ర. అయితే ఆఖరి నిమిషంలో రుక్మిణి పాత్రధారి
రాకపోవడంతో ఆ వేషం నాకు వేసి కృష్ణుని పక్కన నిలుచోబెట్టారు. నేను
అప్పటికి చిన్నపిల్లను, అందునా ఎత్తు తక్కువ. దాంతో కాళ్ల కింద చెక్కలు
వేసి నిల్చోబెట్టారు. ఆ డ్రామాలోనే అక్కినేని నాగేశ్వరరావుగారు సత్యభామ
వేషం వేశారు. మరో విషయం కూడా చెప్పాలి, కాకినాడలోని ‘యంగ్‌మెన్స్ హ్యాపీ
క్లబ్’లోనే ఆదినారాయణరావుగారు సంగీతం అందించేవారు. ఆ తరువాత కొంత
కాలానికే ఆదినారాయణరావుగారితో నాకు వివాహమైంది.
రావద్దనేవాళ్లు…
నటన అనే ప్రవాహంలోకి నన్ను బలవంతంగా నెట్టేసి, నన్నో కళాకారిణిగా మలచింది
మా నాన్నే. ముందు కష్టంగానే అనిపించిందిగానీ నెమ్మదిగా దాన్నే ఇష్టంగా
మలచుకుని ఈదుకుంటూ వచ్చేశాను. అయితే చిన్నవయసులోనే నన్ను తల్లికీ, ఇంటికీ
దూరం చేశానన్న భావన ఆయనలో ఉండేదేమో అనిపిస్తుంది ఆలోచించినప్పుడు. అందుకే కాబోలు, అప్పుడప్పుడూ నాన్న నా దగ్గరకొచ్చి స్వయంగా నాకు భోజనం
తినిపించేవారు.
వెళ్తుండేదాన్ని. ఉన్న కొద్ది సమయంలోనే నా చిన్ననాటి స్నేహితురాళ్లతో
గడిపేదాన్ని. నేను తిరుగాడిన ప్రాంతాలన్నీ చూసుకునేదాన్ని. మద్రాస్ వచ్చి
సినీ ఆర్టిస్టుగా మంచి పేరు వచ్చిన తరువాత మా ఊరు ఎక్కువగా వెళ్లలేకపోయాను.
సినిమా హీరోయిన్ అయిన అమ్మాయి వస్తే గలాభా జరుగుతుందని ఇంట్లోవాళ్లు
వద్దనేవారు. నా స్నేహితురాలు జగదాంబ మాత్రం ఇక్కడకు వస్తుండేది. ఆవకాయ
దబ్బలు,వారికి పండిన కాయగూరలు తెచ్చేది. జగదాంబ ఒక్కతే కాదు, మా ఊరి
వాళ్లెవరు మద్రాసు వచ్చినా మా ఇంటికొచ్చి వెళ్లేవారు. ఇప్పటికీ
పెద్దాపురం మనుషులెవరు కనిపించినా నాకు ప్రాణం లేచొచ్చినట్లుంటుంది.
వారెవరో తెలియకపోయినా, నాకు మాత్రం చాలా ఆత్మీయులుగానే అనిపిస్తుంటారు.
మీ వంగలపూడి శివకృష్ణ