Friday, 27 November 2015

తొమ్మిది మూరల సాహెబు - JANAB MADEENA PACHHA OWLIYA DARGA PEDDAPURAM


హజరత్ షేక్ మదీనా పాచ్ఛా  ఔలియా దర్గా  

HAZARATH SHAIK MADEENAA PASCHA OWLIYAA DARGA SHAREEF - 
JANAB MADEENA PACHHA OWLIYA DARGA -

ప్రపంచానికి పెద్దపండుగ పదిహేడు వరకూ
పెద్దాపురానికి ఇరవై వరకూ (జనవరి 20)

వేల సంఖ్య లో జనం
చిన్న పిల్లల కోలాహలం
యువతీ యువకుల సమ్మేళనం
పెద్దల పూజలు కళాకారుల ప్రదర్శనలు వెరసి గంధోత్సవం - ఉరుష్ ఉత్సవం కన్నుల పండుగ .




"ఉరుష్ అనగా అరబిక్ బాషలో వివాహము లేదా ఆనందకరమైన పండుగ అని అర్ధం"




గంధోత్సవం అనగానే నాకు గుర్తొచ్చేది

గంగాధరం ఆర్కెస్ట్రా

రాజమండ్రి బుచ్చి బాబు మిమిక్రీ
మ్యాజికల్ షోలు
కుర్రాళ్ళ డాన్సులు
బెల్లం బూందీ మిఠాయిలు
ప్రతిఒక్కరి నెత్తిన ముస్లీం కూఫీ టోపీలు
పది అడుగుల పొడవైన పెద్ద పవిత్ర సమాధి



ఆ సమాధి చూసినప్పుడల్లా దాని చరిత్ర తెలుసుకోవాలన్న తహ తహ - కుతూహలం ఎక్కువయ్యేది
సాదారణంగానే సమాదానం దొరికేవరకూ నిద్రపోని నాకు ప్రతి చోట ప్రతికూల సమాదానమే ఎదురేయ్యేది

అసలు ఎవరు ఈ జనాబ్...... ?

ఏంటి అతని కథ.................. ?

శ్రీ వత్సవాయి రాయ జగపతి వర్మ రచించిన పెద్దాపుర సంస్థాన చరిత్రము లో పెద్దాపురం యొక్క విశేష అంశాలలో మొట్టమొదటి గా ప్రస్తావించినది ఇదే

అసలు నిజం ఏమిటి తెలుసుకునే ముందు పెద్దాపురం పరిసర ప్రాంత ప్రజల - సామాన్య “జనాభిప్రాయంలో జనాబ్” ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


మా తాత చెప్పిన తొమ్మిది మూరల సాహేబు కథ
-----------------------------------------------

తొమ్మిది మూరల సాహెబు తాటి చెట్టు మీద బట్టలు అరేసాడంట

పూర్వ కాలంలో పెద్దాపురం లో ఒక పీరు సాయీబు సంచరించేవాడు

ఆ పీరు సాయీబు పిచ్చి మొక్కలు పీక్కుంటూ జనాలకి అర్ధం కాకుండా ఉండేవాడు

ఏటవాలు గా ఉన్న తాటిచెట్టు వంపులో బట్టలు అర బెట్టుకునేవాడట

అతని అరచెయ్యి అరిటాకు అంత వుండేది అంట పిల్లలు కొబ్బరి బొండాలు కావాలని అడిగితే చెట్టుని చేతితో కొడితే రాలేవంట




ఒక రోజు పెద్దాపురం ప్రభువు సరదాగా సికారుకి సాయీబు సంచరించే ప్రాంతానికి వచ్చాడంట ఈ లోపులోనే పెద్దాపురం ప్రభువులు పై శత్రు సైన్యం అకస్మాత్తుగా దాడి ప్రారంబించిందట అది చూసిన సాయీబు పరిగెత్తుకుంటూ పోయి పిచ్చిమొక్కలు పక్కన ఉన్న పొడవాటి వెదురు బొంగులు విరిచి రాజుకి సాయంగా పోరాటం చేయడం మొదలు పెట్టాడంట శత్రు మూక తగ్గుముఖం పట్టాకా రాజు గారికి రక్షణగా కోటవరకూ కాపు కాసి శత్రువులతో పోరాటం చేస్తూ సాగనంపాడంట.




ఆ తరువాత చాలా రోజుల వరకూ రాజుగారి ఆలోచనల నిండా ఆ పీరు సాయీబు - అతని సహాయ గుణం, పొడుగు - పోరాట పటిమ పదే పదే గుర్తొచ్చి నిద్రపట్టక అసలు అతని గురించి తెల్సుకోవాలనిపించి సబకి పిలిపించి అతనికి ఉచితాసనం ఏర్పరిచి సకల మర్యాదల నడుమ ఇతను నా రక్షకుడు అని ప్రకటించాడంట.




అదే సభలో అతని పూర్వ చరిత్ర గురించి అడగగా తానూ కొందరు అతని స్నేహితులు వర్తకం నిమిత్తం సముద్ర ప్రయాణం చేసే వాళ్ళమని మార్గమద్యం లో తుపాను వలన ఓడ మునిగి పోయే సమయం లో చిన్న పడవల ద్వారా బయట పడ్డామని నేను ఎక్కిన పడవ నా అధిక బరువు వల్ల మునిగి పోయే పరిస్థితి రావడం చేత మిగిలిన వారి రక్షణార్ధం తానే స్వయంగా సముద్రం లోకి దూకి ఈదుకుంటూ తీర ప్రాంతం చేరానని అక్కడినుంచి నడక దారి పట్టానని ఈ ప్రాంతం వద్ద స్పృహ తప్పి పడిపోతే ఇక్కడి వారు నన్ను ఆదరించారని నాకు తెలిసిన వారు ఇంకా ఎవరూ లేరని చెప్పాడంట.




అప్పటినుంచి రాజు గారు అతని ని కొలువులోనే ఉండమనీ అతని కి అత్యున్నత సైనిక బాద్యత అప్పగించారంట -- ఆ తరువాత కాలంలో జరిగిన గొప్ప యుద్దంలో శరీరం తునా తునక లవుతున్నా లెక్కచెయ్యక రాజుగారిని కాపాడే క్రమంలో సాహెబ్ అశువులు బాసాడంట అతన్ని కాపాడడానికి అతని పెంపుడు గుర్రం 25 అడుగుల వెడల్పు గల ఏలేరు కాలువ 20 అడుగుల ఎత్తు కోటగోడ దూకినా ప్రయోజనం లేకపోయిందట.




ఇలా గల్లీవర్ లిల్లీ పుట్ కథ మార్చి మార్చి చెప్పేవాడు మేము నోరెళ్ళ బెట్టుకుని చూసేవాళ్ళం తరువాత మా తాత చెప్పిన కథ నిజంగా కథే అని మా తాత సినిమా పరిజ్ఞానం అంతా ఉపయోగించి పాత కధలన్నీ మిక్స్ చేసి సృష్టించిన కధ అని అతి తక్కువ కాలంలోనే అర్ధం అయ్యింది.





మళ్ళీ వచ్చింది జనవరి 20

-------------------------------

నా ప్రాధమిక విద్యాబ్యాసం (బహుశా నేను 4 వ తరగతి అనుకుంటా) ఆ సంవత్సరం లో మా తరగతి మాస్టారు పున్నయ్య ఆయన అప్పుడప్పుడు రాజుల కథలు వారి చరిత్రలు చెప్పేవాడు. అయితే ఇతనికి ఖచ్చితంగా తొమ్మిది మూరల సాయిబు గారి అసలు కధ తెలిసే ఉంటుందనిపించి




" సర్ మన పెద్దాపురం కోటలో తొమ్మిది మూరల సాహెబు గారి 10 అడుగుల సమాధి ఉంది కదా దారి పూర్వ చరిత్ర ఏమైనా మీకు తెలుసా ... అని అడిగా ... !




వెంటనే పున్నయ్య మాష్టారు

ఒరే శివా .... !

సాయీబుల సమాదులంతే సానా పొడవుంటాయి . !

పోయి ద్యాస పుస్తకాల మీద పెట్టు పుకార్ల మీద కాదు.. ! అనేసాడు

చదువుకున్నోడు కదా చరిత్ర చెబుతాడంటే సోదనిచెప్పి కొట్టిపారేశాడు చెడ్డ కోపమొచ్చింది.

ఈ పిచ్చి పున్నయ్య కంటే మా తాత కొండయ్యే మేలు అనిపించిది (అన్నట్టు చెప్పలేదు కదూ మా తాత పేరు వంగలపూడి కొండయ్య మా పాత పెద్దాపురం పెజానీకం ముద్దుగా గుడ్డి కొండయ్య అని పిలుచుకొనేవారు)




కాలం గడుస్తూనే వుంది నా కుతూహలం పెరుగుతూనే వుంది

--------------------------------------------------------------------




ఇదేమీ పనయ్యేలా లేదు వజ్రాన్ని వజ్రం తోనే కోయ్యాలని చెప్పెసేసి నాకు ఉన్న అతి తక్కువ మహమ్మదీయ మిత్రులలో ఒక మిత్రుడ్ని అడిగితే నాకు తెలియదు మా నాన్న కి తెల్సు అన్నాడు ఛాన్స్ కొట్టేసాం అనుకుంటూ వెళ్లి వాళ్ళ నాన్నని అడిగితే అతనూ మా నాన్నకి తెల్సు అన్నాడు

మీ నాన్న గారు ఎక్కడ వున్నారు అంకులు అని అడిగితే

అతని చూపుడు వేలు ఆకాశానికి లేచింది నా ఆశ ఆవిరైపోయింది.







మళ్ళీ జనవరి ఇరవై వస్తూనే వుంది కుతూహలం నిప్పు రగులుతూనే వుంది

-------------------------------------------------------------------------------------




ఇంక పనయ్యేలా లేదని ఆన్ లైన్ కనిపించిన ప్రతీ ముస్లీం సోదరున్నీ అడుక్కుంటూ పోతే

ఒక ముస్లీం సోదరుడు

wa annal masajida lillah; walaa tad'u mallahi ahada!

waman yushrik billahi fakad harramallahu alaihi aljannath...!(Qur'an).




దాని మీనింగ్ ఏంటి రా అన్నయ్యా అని అడిగితే మూడు రోజులు బతిమాలించుకుని ఆడికి మూడొచ్చాక మసీదులు అల్లాకే వుండాలి ఆయన్ని కాకుండా వేరొకరికి నమస్కరిస్తే వాళ్లకి స్వర్గ దారాలు మూసివేయ బడతాయి అన్నాడు నాకు మెంటలెక్కి పోయింది

“మేలు చేసే మొక్కని మొక్కుతాం

భారం మోసే భూమిని మొక్కుతాం

మంచి చేసే మనిషిని మొక్కితే

చంపేసి స్వర్గం డోరు మూసేత్తావా “

సానా బావుందన్నయ్యో నీ వరస

అయినా మేము క్లియర్ గా హజరత్ షేక్ మదీనా పాచ్ఛా ఔలియా "దర్గా" అంటే నువ్వేంటన్నయ్య మసీదు గురించి మెసేజ్ లు ఇస్తున్నావు అన్నాను

నా వయోలన్స్ కి అన్న సైలన్స్ అయిపోయాడు.




“సరే ఇదేమి గోలరా బాబు జనాలు ఇలా ఉన్నారేంటి తెలియకపోతే తెలియదనాలి కానీ ఇలా ఓ ఉచిత సలహా పడేస్తున్నారేంటి అని బాధ పడుతున్న సమయంలో దొరికింది గురూ




“వత్సవాయి రాయ జగపతి వర్మ విరచితము - పెద్దాపుర సంస్థాన చరిత్రము”

పెద్దాపురం సంస్థాన విశేష అంశాలలో మొట్టమొదటి అంశం గా ఆయన దీన్ని రాసుకున్నారు.




ఈ గ్రంధం లో ఆయన ఈ దర్గా గురించి చెప్పిన ముఖ్య విషయం ఏమిటంటే

పెద్దాపురం లో 18 బురుజుల రక్షణ కోటని నిర్మించడానికి పూర్వమే దర్గా అక్కడ వుందని

అది బహు పురాతనమైనది అని

అరి వీర భయంకర దీర పరాక్రమవంతులైన పెద్దాపురం మహారాజులు సైతం ఈ సమాధిని చూసి ఆశ్చర్య చకితులై అనేక మంది మహమ్మదీయ మత పెద్దలను దర్గా విషయమై ఆరా తీయగా




ఈ స్థలం మహమ్మదీయులకు అతి పవిత్రమైన స్థలం గా మా మత గ్రంధములలో చెప్పబడినదని




అందుచేతనే ఆ మహామ్మదీయ సన్యాసి (పీర్ సెయింట్) ఖండాంతరాలు దాటి ఈ పరమ పవిత్ర స్థలంలో పరమపదించారని




ఆ యొక్క సమాధి కి విధిగా ఏటేటా ఉత్సవములు జరిపించ వలసినదని




అప్పుడు పెద్దాపురం సంస్థానానికి శ్రేయోదాయకం అని వివరించారు

అప్పటి నుండీ

మహమ్మదీయులయొక్క అన్ని పండుగ దినములలో సంస్థానాన్ని పరిపాలించిన ప్రభువులందరూ ఈ ప్రదేశం వద్ద జరిగే ఉత్సవాలకి విశేష ఏర్పాట్లు చేసే వారు




అనేక ప్రదేశాలనుంచి ఇక్కడికి ఘోరి దర్శనార్ధం అనేక మంది యాత్రికులు వచ్చేవారు అని మొక్కుబడులు చెల్లించుకునే వారు




ఈ ఘోరీ పరమత సహనానికి ప్రతీకగా పెద్దాపురం లో ఆనాటి నుండీ ఈ నాటి వరకూ అలరారుతున్న పరమ పవిత్ర క్షేత్రం. ........................ఇట్లు మీ వంగలపూడి శివకృ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...