Thursday, 11 February 2016

Salajarya Ganga Raju, Peddapuram, పెద్దాపురం ఆస్థాన కవి - సలజర్ల గంగరాజు తిట్టు కవితలో దిట్ట


పెద్దాపురం ఆస్థాన కవి - సలజర్ల గంగరాజు తిట్టు కవితలో దిట్ట ఇతడు

                                 
తిట్టు కవిత్వమా తిట్టడం కూడా పెద్ద గొప్పగా చెప్తున్నావేంటి రా నాయనా అని నన్ను తిట్టకండి. ఇది చదవండి

                            రాయ జగపతి మాహారాజు గారు పెద్దాపురాన్ని పరిపాలిస్తున్న రోజులవి (1797 - 1804) అప్పటి పెద్దాపురమునకు అనప్పిండి విస్సన్న దివాను గా ఉండేవాడు ఈయన మహా కర్కోటకుడు ప్రజలను అనేక విధాల ఇబ్బందులకు గురిచేసేవాడు ఈ విషయాన్ని తెలుసుకున్న నలజర్ల గంగరాజు లేని పని కల్పించుకుని నేరుగా దివాను దగ్గరకు పోయి మీరు మహా గొప్పవారు మిమ్మల్ని పొగడకుండా ఉండలేక పోతున్నాను అంటూ స్తుతిస్తున్నాను అనే నెపముతో మూడఁవస్థానమున 'హ కారమును ప్రయోగిస్తూ ఒక పద్యము అల్లి చెప్పెనంట దాని అర్ధము కొన్నాళ్ళకి గానీ ఈ దివానుకి తెలియ రాలేదంట. తెలుసుకొన్న కొన్నాళ్ళకి ఈ దివాను దిగులుతో మరణించినాడంట.
కొందరి తిట్టు కవిత్వాలు
వేములవాడ భీమకవి తిట్టు కవిత 
"గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి రాకుమంచు నీత్రిప్పుడు బాపలందరును దిట్టిరి కావున నొక్కమారు నీయప్పములన్ని కప్పలయి యవ్నము సున్నముగాగ మారుచున్బప్పును శాకముల్ పులుసు పచ్చడులుం జిరురాలు గావుతన్"
13వ శతాబ్దానికి చెందిన ఖడ్గ తిక్కన యుద్ధ రంగమునుండి పారిపోయి ఇంటికి రావడంతో అతని భార్య చానమ్మ అతని స్నానానికి మంచం అడ్డుపెట్టి పసుపు ఉండ పెట్టడంతో ఇదేమిటని అడిగిన భర్తతో ఆమె ..
"పగరకు వెన్నిచ్చినచో, నగరే నిను మగతనంపు నాయకులెల్లన్ముగురాడువారమైతిమి, వగపేటికి జలకమాడ వచ్చినచోటన్" అంది.
14-15 శతాబ్దాలకు చెందిన శ్రీనాధుడు.
"సిరిగల వానికి జెల్లును దరుణుల బదియారువేల దగ బెండ్లాడన్దిరిపమున కిద్దరాండ్రీ, పరమేశా! గంగ విడువు, పార్వతిచాలున్" అన్నాడు
16వ శతాబ్దానికి చెందిన తెనాలి రామకృష్ణుడు
"గంజాయి త్రాగి తురకల సంజాతులగూడి కల్లు చవిగొన్నావా?లంజెల కొడకా! యెక్కడ, కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్"
మరి కొన్ని
"నక్కలు బొక్కలు వెదకును, నక్కరతో నూరబంది యగడిత వెదకున్కుక్కలు చెప్పులు వెదకును, దక్కడి నా లంజెకొడుకు తప్పే వెదకున్".
"ఆడినమాటలు దప్పిన, గాడిదకొడుకంచు దిట్టగా వినియయ్యో!వీడా నా కొక కొడుకని, గాడిద యేడ్చెంగదన్న ఘనసంపన్నా!"
ఇంకా ఇలా చాలానే వున్నాయి నాకు సేకరించే ఓపిక వున్నా మీకు చదివే ఓపిక ఉండద్దూ ... !

Peddapuram MuttaDi by Buddavarapu Pattabi ramayya in 1928 పెద్దాపురం ముట్టడి

1928 పెద్దాపురం ముట్టడి : బుద్ధవరపు పట్టాభిరామయ్య 



స్వాతంత్య్రాభిలాష ను తెలుగు జాతి నర నరాలకు ప్రవహింప జేయడంలో చారిత్రిక నాటకాలు ప్రముఖ పాత్రను పోషించాయి అని చెప్పడం లో ఏ విధమైన సందేహం లేదు అందులో భాగంగానే 1920-30లలో అనేక చారిత్రక నాటకాలు వెలువడి ప్రదర్శితమయ్యాయి. నాటకాలను ఓ ప్రధాన ప్రచార సాధనంగా ఆనాటి నాయకులు ఉపయోగించారు. అందులో ముఖ్యంగా శ్రీ బుద్దవరపు పట్టాభిరామయ్య గారి 'మాతృ దాస్య విమోచన (1924), పెద్దాపురం ముట్టడి (1928) చెప్పుకోతగినవి.

 144 పేజీల ఈ పెద్దాపురం ముట్టడి అనే కథని మరియు మన పెద్దాపురం నివాసి అయిన శ్రీ బుద్దవరపు పట్టాభి రామయ్య గారి గురించిన విషయాలను త్వరలోనే పొందుపరుస్తాను అని తెలియ చేసుకుంటూ






                                                                                     మీ వంగలపూడి శివకృష్ణ

First Novel of Telugu about Peddapuram తెలుగు తొలి నవలలో పెద్దాపురానికి పలు పేజీలు




తెలుగు తొలి నవలలో పెద్దాపురానికి పలు పేజీలు


మొట్టమొదటి సాంఘికనవల 'రాజశేఖర చరిత్రము' లో పెద్దాపురం


          
గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు (1848–1919) ఆనాటి సాంఘిక దురాచారాలు - మూఢ నమ్మకాలు నేపద్యంలో ‘ఆలివర్ గోల్డ్ స్మిత్’ ఆంగ్లం లో రచించిన 'ది వికార్ అఫ్ ది వేక్ ఫీల్డ్' నుండి స్ఫూర్తి పొంది తెలుగులో 135 సంవత్సరాల క్రితమే రచించిన 'రాజశేఖర చరిత్రము’ లో ఎనిమిదవ ప్రకరణం మొదలుకొని నవల చివరివరకూ ఎన్నో ఆసక్తి కరమైన మలుపులు ప్రతీ మలుపులో ‘పెద్దాపురం’ సంగతులు 
‘కుమ్మరి వీధి దహనం’ - 
‘గ్రామ దేవత మరిడమ్మ తల్లి జాతర’ 
 మంత్రజుడు వీరదాసు విన్యాసాలు 
కట్టమూరు ఊరి విశేషాలు 
పెద్దాపురం మహారాజు దయార్ద హృదయం -

ఆసక్తి కలవారు పూర్తి కధ కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి
 https://plus.google.com/+vangalapudisivakrishna/posts/

Tuesday, 19 January 2016

Actress Anjali Devi Peddapuram పెద్దాపురం - అంజలీదేవి

 

పెద్దాపురం -  అంజలీదేవి  జననం : 24-Aug-1928   -   మరణం : 13-Jan-2014



 

అంజలీదేవి… పరిచయం అక్కరలేని పేరు. సీతమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో

అనిపించేలా నటించిన ఆమె దేశ విదేశాల్లో తిరిగినా, ఎంతో పేరు ప్రఖ్యాతులు

గడించినా తన స్వస్థలం పెద్దాపురం పేరు వింటే పులకించిపోతారు. స్వస్థలం

గురించి చెబుతున్నప్పుడు ఐదేళ్ల పసిపాపలా సంబరపడిన ఎనభైఐదేళ్ల అంజలీదేవి

ఊరి విశేషాలు ఆమె మాటల్లోనే…


“కన్నతల్లి, పుట్టినూరు – ఎవరి జీవితంలోనైనా ఎంతో ముఖ్యమైనవంటారు,

ఎప్పటికీ మరపురానివంటారు. కానీ నేను చిన్నప్పటి నుంచీ జన్మభూమికీ,

జన్మనిచ్చిన తల్లికీ దూరంగానే ఉండాల్సి వచ్చింది. బాల్యంలోనే కళాకారిణి

అయినందుకు సంతోషించాలో, అద్భుతమైన ఆటపాటల కాలాన్ని కోల్పోయినందుకు

బాధపడాలో అర్థం కాని పరిస్థితి నాది.


ఇప్పుడు నా మనవళ్లను, మనవరాళ్లను చూస్తుంటే నా బాల్యాన్ని ఎంత పోగొట్టుకున్నానో అర్థమవుతోంది. ఇంత పెద్దదాన్నయినా, ఇంత పేరు ప్రఖ్యాతులు గడించినా, వందల మైళ్ల దూరం తరలి వచ్చేసినా నా బాల్యం, మా ఊరి స్మృతులు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే వుంటాయి.


బొమ్మల పెళ్లిళ్లు

మాది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం. పూర్వం నుంచే అభివృద్ధి చెందిన

పట్టణం. 1928లో నేను అక్కడే పుట్టాను. మా అమ్మ సత్యవతి, నాన్న నూకయ్య.

నాకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. నా అసలు పేరు అంజనీకుమారి. సినిమా

రంగంలోకి వచ్చిన తరువాత అంజలీదేవిగా పేరు మార్చారు. సంతానంలో పెద్దదాన్ని

కావడంతో ఇంట్లో నాకు హక్కులు కొంచెం ఎక్కువగానే వుండేవి. మాది వ్యవసాయ

కుటుంబం.


కొంచెం పొలం ఉండేదనుకుంటా. మాకు మొన్నటి వరకూ అక్కడ ఇల్లు వుండేది.

ఇటీవలే దానిని అమ్మేశాం. మేమున్న వీధిలో ప్లీడర్లు ఎక్కువగా వుండేవారు.

అందుకే దానికి ప్లీడర్ వీధి అని పేరొచ్చింది. మా ఇంటి చుట్టూ బ్రాహ్మణ

కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. అందుకే నా స్నేహితురాళ్లంతా వారే ఉండేవారు.

జగదాంబ, మాణిక్యం అని ఇద్దరు స్నేహితురాళ్లు నాకు బాగా యిష్టం. మేమంతా

కలసి కొత్తకొత్త ఆటలు కనిపెట్టేవాళ్లం.


ఏదో ఒక పాత ఆట చూసి దానికి వెనుకాముందూ ఏవేవో జోడించి అదే కొత్త ఆటగా

ఆడేవాళ్లం. దాంతో మిగతావాళ్లు కొత్తకొత్త ఆటల కోసం మాదగ్గరకొచ్చేవాళ్లు.

ముఖ్యంగా బొమ్మల పెళ్లిళ్లు బాగా చేసేవాళ్లం. పెళ్లికొడుకు పెళ్లి కూతురు

బొమ్మలను అందంగా ముస్తాబు చెయ్యడం, పెళ్లి భోజనాలకు కావలసిన దినుసులన్నీ

సమకూర్చుకోవడం… వీటితో ఊపిరి తిరగనంత పని ఉండేది. బొమ్మల పెళ్లిళ్లలో

‘చెంగల గౌరీ…’ లాంటి పాటలు పాడేవాళ్లం. ఎనిమిదేళ్ల వయస్సులోనే ఇలాంటి

పాటలు బోలెడు వచ్చు నాకు. ఆడుకోవడమంటే నాకు చాలా ఇష్టం. మిగిలిన లోకం

పట్టేదే కాదు.


ఆంజనేయుడంటే ఇష్టం

అప్పట్లో బ్రాంచ్ గర్ల్స్ స్కూలు ఉండేది. అందులో నేను నాల్గవ తరగతి వరకూ

చదువుకున్నాను. మా ఇల్లు పెద్దాపురం మొదట్లోనే వుండేది. ఇంటి నుంచి

స్కూలుకు వెళ్లేటప్పుడు ప్రతిరోజూ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లేదాన్ని.

అప్పట్లో నాకు ఆ దేవుడంటే మహా ఇష్టం. అందుకే స్వామికి దండం పెట్టుకున్న

తర్వాతే బడికి వెళ్లేదాన్ని. ఆ మమకారంతోనే అనుకుంటా, ఆ స్వామివారు తరువాత

నన్ను తనకిష్టమైన జగజ్జనని సీత పాత్ర లో నటించే అవకాశం కల్పించారు.


మా ఊళ్లో ముప్పనాస్ వారి థియేటరుండేది. అందులో సినిమాలు, నాటకాలు

వేసేవాళ్లు. నేను కూడా ఎప్పుడన్నా వెళ్లి సరదాగా చూసి వచ్చేదాన్ని. నేను

నాలుగో తరగతి చదువుతున్న సమయంలో ఓ రోజు మా నాన్న స్కూలుకొచ్చారు.

రెక్కపట్టుకుని గబగబా ఈడ్చుకెళ్లినంత పని చేశారు. ఆయన ఎందుకలా

తీసుకెళ్తున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో నాకర్థం కాలేదు. ముప్పనాస్

థియేటరు రిహార్సల్ గది వద్దకు తీసుకెళ్లి నన్ను నిలబెట్టేశారు.

అప్పటికి నాకసలు విషయం అర్థమైంది. భద్రాచార్యులవారు వేస్తున్న

హరిశ్చంద్ర నాటకంలో లోహితుడు పాత్రధారి రాలేదని ఆ వేషం కోసం నన్ను

తీసుకెళ్లారు. అది మగపిల్లాడి పాత్ర కావడంతో ఒక్కసారిగా నా జుట్టు

కత్తిరించేశారు. దాంతో నేను ఒకటే ఏడుపు. ఆ తరువాత రెండు రోజులు

రిహార్సల్స్ చేయించారు. హరిశ్చంద్ర నాటకంలో లోహితుడు చనిపోతాడు. అంటే

నేను స్టేజ్‌మీద కదలకుండా చనిపోయినట్లు పడుకోవాలి.


అలా కొద్దిసేపు పడుకునేటప్పటికి నేను నిద్రపోయాను. కొద్దిసేపటి తరువాత

ఎవరో నన్ను కదుపుతుంటే కళ్లు తెరిచాను. నా చేతిలో కర్పూరం పెట్టి

చంద్రమతి పాత్రధారి దానిని వెలిగించి నామీద పడి పెద్దగా ఏడుస్తోంది. ఆ

మంటతో నేను కాలిపోతానేమోనని భయమేసింది. కానీ చంద్రమతి వేషం వేసినావిడ

బాగా మేనేజ్ చేసింది. ఏదైతేనేం, ఆ రోజు లోహితుని పాత్రధారి రాకపోవడం నా

జీవితానికి కొత్త మలుపు అయింది.


జీవితం మారిపోయింది…

ఆ డ్రామా అయిపోయింది కానీ, ఆ తర్వాత నా జీవన శైలి మాత్రం మారిపోయింది. ఆ

రోజు నుంచీ ఆటలు పాటలు, స్నేహితురాళ్లతో తిరుగుళ్లు – అన్నీ ఆగిపోయాయి.

తెల్లవారేసరికి నాట్యం నేర్పే గురువుగారి దగ్గరకెళ్లాలి. సాయంత్రం మళ్లీ

నాట్యం. మధ్యలో సంగీత సాధన. ఇదే నా నిత్యకృత్యం. నాన్న తబలా వాయించేవారు.

ఆయనకు సంగీతమంటే భలే ఆసక్తి. నాకేమో ఆటలు తప్ప మరి దేనిమీదా ఇష్టముండేది కాదు. కానీ నాట్యం, సంగీతమంటూ మా నాన్న నన్ను తెగ విసిగించేవారు.

చిన్నతనం కదా, నేను బాగా మొండికేసేదాన్ని.నా మొండితనాన్ని సహించలేకనో లేదంటే నాకు ఇంకా బాగా శిక్షణనిప్పించాలన్నఉద్దేశమో తెలియదుగానీ నన్ను కాకినాడలో వున్న ‘యంగ్‌మెన్స్ హ్యాపీక్లబ్’లో చేర్పించారు నాన్న. ఇప్పటి రెసిడెన్షియల్ స్కూళ్లలాగా అన్నమాట. అక్కడే భోజనాలు పడక అంతా. అప్పటికి నా వయసు తొమ్మిదేళ్లు. అక్కడ నటనలో మంచి శిక్షణ లభించేది. అయినా నేను కొంటె చేష్టలు మానలేదు. తెగ అల్లరిచేసేదాన్ని. అక్కడున్న సైకిళ్లకు గాలి తీసేయడం, దుస్తుల్ని దాచేయడం వంటివి ఒకటా రెండా…! అలా చేస్తే ఇంటికి పంపించేస్తారన్న నమ్మకమేమో

బహుశా!


1939లో అనుకుంటా మా క్లబ్ ఆధ్వర్యంలో ‘కుచేల’ డ్రామా వేశాం.

అందులో నాది రాఘవ పాత్ర. అయితే ఆఖరి నిమిషంలో రుక్మిణి పాత్రధారి

రాకపోవడంతో ఆ వేషం నాకు వేసి కృష్ణుని పక్కన నిలుచోబెట్టారు. నేను

అప్పటికి చిన్నపిల్లను, అందునా ఎత్తు తక్కువ. దాంతో కాళ్ల కింద చెక్కలు

వేసి నిల్చోబెట్టారు. ఆ డ్రామాలోనే అక్కినేని నాగేశ్వరరావుగారు సత్యభామ

వేషం వేశారు. మరో విషయం కూడా చెప్పాలి, కాకినాడలోని ‘యంగ్‌మెన్స్ హ్యాపీ

క్లబ్’లోనే ఆదినారాయణరావుగారు సంగీతం అందించేవారు. ఆ తరువాత కొంత

కాలానికే ఆదినారాయణరావుగారితో నాకు వివాహమైంది.


రావద్దనేవాళ్లు…

నటన అనే ప్రవాహంలోకి నన్ను బలవంతంగా నెట్టేసి, నన్నో కళాకారిణిగా మలచింది

మా నాన్నే. ముందు కష్టంగానే అనిపించిందిగానీ నెమ్మదిగా దాన్నే ఇష్టంగా

మలచుకుని ఈదుకుంటూ వచ్చేశాను. అయితే చిన్నవయసులోనే నన్ను తల్లికీ, ఇంటికీ

దూరం చేశానన్న భావన ఆయనలో ఉండేదేమో అనిపిస్తుంది ఆలోచించినప్పుడు. అందుకే కాబోలు, అప్పుడప్పుడూ నాన్న నా దగ్గరకొచ్చి స్వయంగా నాకు భోజనం

తినిపించేవారు.


చిన్నప్పుడే నేను మా ఊరిని వదిలేసినా చాలా పెద్దయ్యేవరకూ నా మనసంతా అక్కడే తిరుగుతుండేది. ఆ తరువాత అదే అలవాటైపోయింది. నాటకాలనీ, సాంస్కృతిక కార్యక్రమాలనీ ఊళ్లు తిరగాల్సి వచ్చేది. అయితే వీలున్నప్పుడల్లా నా స్వస్థలానికి

వెళ్తుండేదాన్ని. ఉన్న కొద్ది సమయంలోనే నా చిన్ననాటి స్నేహితురాళ్లతో

గడిపేదాన్ని. నేను తిరుగాడిన ప్రాంతాలన్నీ చూసుకునేదాన్ని. మద్రాస్ వచ్చి

సినీ ఆర్టిస్టుగా మంచి పేరు వచ్చిన తరువాత మా ఊరు ఎక్కువగా వెళ్లలేకపోయాను.


సినిమా హీరోయిన్ అయిన అమ్మాయి వస్తే గలాభా జరుగుతుందని ఇంట్లోవాళ్లు

వద్దనేవారు. నా స్నేహితురాలు జగదాంబ మాత్రం ఇక్కడకు వస్తుండేది. ఆవకాయ

దబ్బలు,వారికి పండిన కాయగూరలు తెచ్చేది. జగదాంబ ఒక్కతే కాదు, మా ఊరి

వాళ్లెవరు మద్రాసు వచ్చినా మా ఇంటికొచ్చి వెళ్లేవారు. ఇప్పటికీ

పెద్దాపురం మనుషులెవరు కనిపించినా నాకు ప్రాణం లేచొచ్చినట్లుంటుంది.

వారెవరో తెలియకపోయినా, నాకు మాత్రం చాలా ఆత్మీయులుగానే అనిపిస్తుంటారు.

                                                                                                                మీ వంగలపూడి శివకృష్ణ 

గాలి బంగళా - Hillock Mansion - 1937 Peddapuram

మన పెద్దాపురం - గాలి బంగళా 




మన పెద్దాపురం - గాలి బంగళా

కళ తప్పిన గాలిబంగాళా : కార్తీకం లోనూ వెల వెల

ఎన్ని చూసాను .... ఎంత చేసాను

కుల భోజనాలు - స్కూళ్ళ భోజనాలు

పెద్దల కుతూహలం - పిల్లల కోలాహలం

రాజకీయ నాయకుల రాచకార్యాలు

యువతీ యువకుల రాసలీలలు

గాలికూడా చొరబడనంత -

ఊక వేస్తే రాలనంత జనసందోహాన్ని

చూసిన సందర్భాలెన్నో

పేకాటలు - జోకాటలు

జీడి చెట్లకు ఉయ్యాలలు

చింత చెట్టుకు రాళ్ళ దెబ్బలు

గానా బజానా అన్నీ ఆగిపోయాలి

మళ్ళీ మొదలుపెట్టరూ

గాలి బంగళా - Hillock Mansion - 1937 Peddapuram -


ముప్పన వారి గెస్ట్ హౌస్ - (అతిధి గృహం) పెద్దాపురం లోని పాండవుల మెట్ట తరువాత అత్యంత ఎత్తైన ప్రదేశం - భవంతి ఇదే - ఇక్కడి నుండి చూస్తే కాకినాడ సముద్రం కనిపించేలా అప్పట్లో దీని నిర్మాణం జరిగింది. కార్తీక మాసం లో ప్రతి ఏటా దాదాపు 3 లక్షల మంది చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వనభోజనాల నిమిత్తం ఇక్కడికి వస్తూ వుండేవారు - అలా సందర్శించే వారికోసమే 10 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఉసిరి - జమ్మి - మామిడి - జీడి మామిడి చెట్లు ఆక్కడ జనాలు సేదతీరడానికి అనువుగా నాటించడం జరిగింది. ముప్పన సోమరాజు - వీర్రాజు హై స్కూల్ నుండి మొదలుకొని బైపాస్ రోడ్డు వరకూ గల సుమారు 110 ఎకరాల సువిశాల స్థలంలో దాదాపు 70ఎకరాల స్థలం అంతా దుంప తోట 10ఎకరాలు మామిడి తోట 20ఎకరాల జీడి మామిడి తోట 10ఎకరాల ఖాళీ స్థలం వనభోజనాల నిమిత్తం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం లో ఎంతో అట్టహాసం గా జరిగేది అయితే సాంకేతికత - రవాణా వ్యవస్థ - ఆచార వ్యవహారాలలో వచ్చిన పెను మార్పుల వల్ల ఇటీవల కాలంలో దీని ప్రాభల్యం చాలా వరకూ తగ్గి పోయింది అయినా సందర్శకులను అలరించడానికి తానెప్పుడు సిద్దమేనని మొన్న నేను సరదాగా పలకరించడానికి వెళ్ళినప్పుడు ముప్పన వారి గెస్ట్ హౌస్ మౌనంగా చెప్పింది. 









Monday, 18 January 2016

జవహార్ నవోదయా విద్యాలయ పెద్దాపురం - JAVAHAR NAVODHAYA VIDYALAYA PEDDAPURAM - JNV PEDDAPURAM

జవహార్ నవోదయా విద్యాలయ పెద్దాపురం - 

  గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ కలిగిన విద్యార్ధులకి ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో 1985 వ సంవత్సరంలో నవోదయా విద్యాలయా సమితి (మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Resource Development) , భారత ప్రభుత్వ విద్యా శాఖ యొక్క ఆధ్వర్యంలో నడిచే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ) ప్రారంభం కాగా మొట్టమొదటి విద్యాలయం హర్యానా లో 05-03-1986 న స్థాపించడం జరిగింది తరువాతనెలలో 06-03-1986 న మహారాష్ట్రలో స్థాపించడం జరిగింది అదే క్రమంలో జనవరి 1989 లో మన పెద్దాపురంలో స్థాపించడం జరిగింది ఇలా భారతదేశం మొత్తం మీద 2014 నాటికి 596 విద్యా సంస్థలు నెలకొల్పబడ్డాయి (ఒక్క తమిళనాడు లో మాత్రం జవహార్ నవోదయా విద్యాలయం లేదు)



మన రాష్ట్రంలోనే 14 చోట్ల (జిల్లాకి ఒక్కటి ప్రకాశం జిల్లాకి రెండు)  జవహార్ నవోదయ విద్యా సంస్థలు ఉన్నాయి


@జవహార్నవోదయావిద్యాలయపెద్దాపురం ప్రిన్సిపాల్ @
31-01-2014 వరకూ ఎ. ఎస్ ఎన్ మూర్తి గారు ప్రిన్సిపాల్ గా కొనసాగి పదవీ విరమణ చెయ్యగా 
ప్రస్తుత జవహార్ నవోదయా విద్యాలయ పెద్దాపురం  ప్రిన్సిపాల్ గా వి. మునిరామయ్య గారు కొనసాగుతున్నారు 


@ప్రవేశంఅర్హత@
2016 - 2017 విద్యా సంవత్సరం జవహార్ నవోదయ విద్యాలయ  ప్రవేశానికి గానూ
9 - 13 సంవత్సరాల మద్య వయస్సుగల 5 వ తరగతి చదివే విద్యార్దుల నుండి 2015 సెప్టెంబరు వరకూ దరఖాస్తులు స్వీకరించారు. ప్రవేశ పరీక్ష జనవరి 9 - 2016 న  ఉదయం 11:30 కి జరగనుంది.


5వ తరగతి చదువుకునే విద్యార్థుల్లో అర్హులు ఈ ప్రవేశపరీక్షకు హాజరవుతారు. ఎంపికైన విద్యార్థులు నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతినుంచి ఇంటర్మీడి యెట్ వరకు సెంట్రల్ సిలబస్తో ఉచిత విద్యను అభ్యసిస్తారు.

అర్హత వివరాలు :
విద్యార్ధి 9-13 సంవత్సరాల మద్య వయస్సుగల వాడై ఉండాలి.
5 వ తరగతి చదువుతూ ఉండాలి (గ్రామీణ ప్రాంత విద్యార్ధులు 3,4, మరియు 5 వ తరగతి చదివే వాడై ఉండాలి.)
ఒక విద్యార్ధి ఒక్కసారి మాత్రమే పరీక్ష వ్రాయడానికి అర్హుడు

@సీట్లురిజర్వేషన్లు@
జవహర్ నవోదయ ప్రవేశపరీక్షల్లో రిజర్వేషన్లకు అనుగుణంగా ఎంపికైన విద్యార్థులే సీట్లు పొందుతారు. ఢిల్లీ స్థాయిలో జరిగే ఈ పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు జరగవు. పరీక్షపత్రాలు కూడా ఢిల్లీ నుంచి వస్తాయి.

ఒక్క విద్యా సంవత్సరానికి గరిష్టంగా 80-90 మంది విద్యార్దులను మాత్రమే ఎంపిక చేసుకుంటారు గ్రామీణ ప్రాంత విద్యార్ధులకి 75% పట్టణ ప్రాంత విద్యార్ధులకి 25% సీట్లు మొత్తం సీట్లలో విద్యార్ధినులకి(ఆడపిల్లలకి 1/3 మూడు వంతులలో ఒక వంతు సీట్లు మరియు 3 శాతం వికలాంగులకి కేటాయించ బడతాయి అంటే ప్రతి వందమంది నవోదయ విద్యార్ధులలో 33 మంది అమ్మాయిలు ముగ్గురు వికలాంగులు ఖచ్చితం గా ఉంటారన్న మాట.

బారత దేశంలోనే ఒక విద్యార్ధి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, పెన్నులు, యూనిఫాం , ఉచిత నివాసం, భోజనం, విద్యా వసతిలను కల్పిస్తున్న ఒకే ఒక్క మొట్టమొదటి సంస్థ (11 - 12 తరగతులు చదివే జనరల్ (ఉన్నత కులానికి చెందిన) విద్యార్ధుల నుండి మాత్రం నెలకి 200 రూపాయలు నవోదయ వికాస నిధి పేరిట తీసుకుంటారు ఒక వేళ వారు దారిద్య రేఖకి దిగువన ఉన్నవారైతే చెల్లించనవసరం లేదు)
విద్యార్ధుల కి వసతిగృహాలు ఆరావళి, నీలగిరి, శివాలిక్ మరియు ఉదయగిరి వంటి పర్వతా ల పేర్లతో ఏర్పాటు చెయ్యబడతాయి

‘Hami Navodaya Hain’ అనే ప్రార్ధనా గీతంతో తరగతులు ప్రారంభం అవుతాయి
పూర్వపు గురుకులాలను తలపించేలా గొప్ప క్రమ శిక్షణతో కూడిన విద్య
ప్రతీ విద్యార్ధి తప్పని సరిగా బహుబాషా ప్రావీణ్యం ( కనీసం 3 బాషలు) పొందేలా శిక్షణ వుంటుంది
ప్రత్యేక ఆసక్తి ఉన్న 9 వ తరగతి చదివే విద్యార్ధులలో 30 శాతం మందిని ఎంపికచేసి ఇతర రాష్ట్రాల లోని నవోదయా విద్యాలయాలకి పంపించడం జరుగుతుంది, అక్కడివారిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది
ప్రతీ విద్యార్ధి లోనూ అంతర్లీనంగా ఉన్న కళలను వెలికి తీయడానికి ప్రతీ వారం ఒక విభిన్న కార్యక్రమం
సామ్ సంగ్ స్మార్ట్ లాబ్ టెక్నాలజీ ద్వారా సాంకేతిక పద్దతులలో శిక్షణ

రోజుకు రెండు గంటలు తప్పనిసరి క్రీడలు ప్రతీ సంవత్సరం క్రీడా సంబరం 3 రోజులు పాటూ జరిగే క్రీడోత్సవాలకు దాదాపు 50 నవోదయా విద్యాలయాలు పాల్గొంటాయి.

ఇక్కడ చదివిన విద్యార్ధులు దేశ విదేశాలలో అనేకమైన ఉన్నత స్థానాలలో వున్నారు సెప్టంబరు 2012 సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ వేడుక ఘనంగా జరుగగా ప్రపంచం నలుమూలలనుండీ అందరూ హాజరై పాత జ్ఞాపకాల్ని అందరితోనూ పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు

నవోదయా లో చదువుతున్న చదివిన ప్రతి విద్యార్ధికి
www.jnvalumini.com (జె న్ వి అల్యూమిని) పేరుతో ఉన్న ఒక వెబ్సైటు లోకి ప్రవేశం వుంటుంది - ఈ వెబ్ సైటు ద్వారా ఆయా నవోదయా విద్యాలయాల వివరాలు తెలుసుకొనేలా మరియు నవోదయా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు సౌలబ్యం వుంటుంది

ఇటీవల అంతర్గత మాట్రిమోనీ (నవోదయా అద్యాపకులు - నవోదయాలో చదివి స్థిరపడిన యువతీ యువకులకి పరస్పర అంగీకారంతో వివాహాలు జరగడం విశేషం)


మీ వంగలపూడి శివకృష్ణ

మహారాణీ సత్రం - S.R.V.B.S.J.B MAHA RANI CHOULTRY PEDDAPURAM

పెద్దాపురం సంస్థానం : మనసున్న మా అమ్మ బుచ్చి సీతాయమ్మ

శ్రీ రాజా వత్సవాయి రాయ జగపతి మహారాజు గారి మొదటి భార్య లక్ష్మీనరసాయమ్మ మరియు మూడవ భార్య బుచ్చి బంగారయ్యమ్మ లకు సౌందర్యవతి అయిన సవతి ఈమె


అందం -ఔధార్యం, దానం – సుగుణం, సహనం - సౌశీల్యం అనే పదాలకు నిలువెత్తు నిదర్శనం ఆమె రూపం
ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనగల ధీరోదాత్తత, మానసిక బలం ఆమె సొంతం


శ్రీ వత్సవాయ రాయ జగపతి మహారాజు గారు పెద్దాపురం సంస్థానాన్ని 1797 నుండి 1804 వరకూ పరిపాలించి మరణించిన తరువాత,

అంతపురం లో ఎన్నో అంతరాలు ...
లక్ష్మీ నరసాయమ్మ - బుచ్చి బంగారయమ్మ ల కలహాలు
రాజమందిరం చుట్టూ రాజకీయాలు
రాజమండ్రి జిల్లా కలక్టరు కుదిర్చిన రాజీ ప్రకారం
రాజ్యాధికారం నాదేనంటూ రాజా జగన్నాధ రాజుగారు ఆర్భాటం

భీమవరపుకోట వాస్తవ్యులతో బుచ్చి సీతాయమ్మ సింహాసనం కోసం 12 ఏళ్ళ సుదీర్ఘ న్యాయ పోరాటం.......................................................... ఇలా చెప్పుకుంటూ పోతే

మహారాణీ బుచ్చి సీతాయమ్మ గారి జీవితం - రాణీవాసం - సింహాసనం ఏమీ వడ్డించిన విస్తరి కాదు ఎన్నోఒడిదుడుకులు ఎన్నెన్నో అడ్డంకులు మరెన్నో అవాంతరాలు అయినా ఆమె ఏనాడూ ఔన్నత్యాన్ని వీడలేదు, తాను ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి పారిపోలేదు.

అంతఃపుర స్త్రీగా అందుకుంటున్న గౌరవాలను పక్కనబెట్టి ఒక మహిళగా సామాన్య పేద గృహిణి జీవితంలోని కష్ట నష్టాలను ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేసారు .

అన్నార్తుల ఆకలి తీర్చే
అన్నదానాన్ని వ్రతం గా ఆచరించిన అమ్మ ఆమె
ధీనజనోద్ధరణని దైవంగా బావించి
పేదల పక్షాన నిలిచిన ప్రేమమూర్తి.

అన్నిదానములకన్న అన్నదనమే మిన్న
కన్నవారికంటే ఘనులు లేరు
ఎన్న గురునికన్న నెక్కువ లేరయా
విశ్వాధాబి రామ వినురవేమా ! అన్న వేమన్న నీతి పద్యం ఆమెకి నిత్య స్ఫూర్తి.



అందుకే, అన్నార్తుల ఆకలి తీర్చేందుకే, 1926 లో రాజ్యాధికారం చేపట్టిన రెండేళ్ళ వ్యవధిలోనే 1928 లో పెద్దాపురంలో అమ్మన్న అనే పెద్ద జమిందారు యొక్క ఇల్లు స్వాదినం చేసుకుని సత్రాన్ని నిర్మిచి ఆ సత్రానికి నిర్వహణ నిమిత్తం ఐదు వందల ఎకరాల సుక్షేత్రమైన వ్యవసాయ స్థలాన్ని కేటాయించింది. వెనువెంటనే ఒంటిమామిడి లో మరొక సత్రాన్ని ( ఈ సత్రం ఇప్పుడు కత్తిపూడి కి మార్చబడింది)

నిర్మింపచేసింది. నేటికీ ఈ సత్రాల ద్వారా ఎందరో పాద చారులు మరెందరో పేద విద్యార్ధులు మూడుపూటలా కడుపునిపుకుంటున్నారు.

ఆ తరువాత కాలంలో వ్యవసాయ స్థలం ద్వారా వచ్చే ఆదాయంలో సత్రాల నిర్వహణకు పోగా మిగులు నిధులను - ఉన్నత విద్యకోసం వేరు ప్రాంతాలకు వలస పోతున్న విద్యార్దుల సౌకర్యార్దం 1967 సంవత్సరంలో బుచ్చి సీతాయమ్మ గారి జ్ఞాపకార్ధం పెద్దాపురంలో శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహా రాణీ కళాశాల నిర్మాణం జరిగింది - ఈ నిర్మాణానికి శ్రీ రాజా వత్సవాయి కృష్ణమరాజ బహద్దరు గారు , భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు, శ్రీ..ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు గారు ప్రముఖ పాత్ర వహించారు ఈ రెండు సత్రాలను 1969 వ సంవత్సరంలో జిల్లా పరిషత్ నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకుని అన్నదానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.

భూమ్యాకాశాలు ఉన్నంత వరకూ ప్రపంచపటంలో పెద్దాపురం పేరు ఉన్నంత వరకూ మా అమ్మ బుచ్చి సీతాయమ్మ పేరు చరిత్రలో అజరామరమై నిలిచే వుంటుంది.

...................................................... ఇట్లు మీ వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...