Friday, 4 March 2016

Raya Bhupaala Patnam - RB Patnam - Peddapuram

రాయ భూపాల పట్నం - రాగమ్మ చెరువు - రత్నగర్భ వినాయకుడు 








రాయభూపాల పట్నం - వత్సవాయి రాయ జగపతి మహారాజు గారు కొంపెల్ల మహా లక్ష్మి (లక్ష్మీసోదెమ్మ) అనే బ్రాహ్మణ వితంతు మహిళకి కృతజ్ఞతా పూర్వకంగా సమర్పించిన లక్ష్మీపుర ఆగ్రహారానికి నామాంతరం.
అసలు ఈ కొంపెల్ల మహా లక్ష్మి ఎవరు రాజు గారు ఈమెకు ఎందుకు ఋణపడ్డారు అనే విషయం తెలియాలంటే ఈ చిన్న కదా చదవాల్సిందే .... !
రుస్తుం ఖాన్ పెద్దాపురం కోటను ఆక్రమించుకోవడానికి సైన్య సమేతం గా బయలుదేరాడన్న విషయం వేగుల(గూడాచారులు) ద్వారా రాగమ్మ గారికి తెలిసింది. ఏడాది బాలుడు, పెద్దాపురం సంస్థాన భావి వారసుడైన రాయగజపతిని తనకు అత్యంత సన్నిహితురాలైన కొంపెల్ల మహా లక్ష్మి (లక్ష్మీసోదెమ్మ) కి ఇచ్చి విజయనగర సంస్థాన మహారాజు పూసపాటి విజయరామరాజు గారి భార్య చంద్రాయమ్మకు ఇక్కడ జరిగినదంతా తెలియ చేసి ఈ బాలున్ని అప్పగించ వలసినదిగా ఆజ్ఞాపించింది. ఆతరువాత రాగమ్మ గారు మిగిలిన అంతపుర స్త్రీలు అందరు పెద్దాపుర సంస్థానానికి నమ్మకస్తుడైన సేవకుడు చల్లా పెద్ది చేత కోటకి నిప్పు పెట్టించుకుని అగ్నిప్రవేశం చేసారు.
కొంపెల్ల మహా లక్ష్మి పసిబాలుడు రాయ జగపతి ని ఎత్తుకుని విజయనగరం బయలు దేరుతుండగా మార్గమద్యంలో రుస్తుం ఖాన్ అనుచరులు ఆమెను ఆపి ఆబాలుడు ఎవరు అని ప్రశ్నించారు. దానికి ఆమె నా బాలుడే అని సమాదానం ఇచ్చింది. ఆ యొక్క వితంతు బ్రాహ్మణ స్త్రీ వేష దారణ చూసిన సైనికులకు ఆమెపై అనుమానం వచ్చి ఒక జామ పండు తెచ్చి ఆ బాలుడు తో కొరికించి ఆ ఎంగిలి పండును ఆమె ను తినమని చెప్పారు (ఆచార నియమాలు పవిత్రం గా బావించే ఆనాటి బ్రాహ్మణ స్త్రీలకు ఎంగిలి (యుచ్చిష్ట ఫలం) నిషిద్దం) అయినా బాలుని సంరక్షణార్ధం వారికి ఎటువంటి అనుమానం రాకుండా ఆ ఎంగిలి పండు తిని వారిని నమ్మించి అక్కడ నుండి బయలుదేరెను. ఆ వెనువెంటనే పెద్దాపురం కోట చేరుకున్న రుస్తుం ఖాన్ జరిగిన విషయం అంతా తెలుసుకుని సైనికులపై మండిపడి తక్షణమే బాలున్ని పట్టుకుని తీసుకు రావాల్సింది గా సైనికులను ఆజ్ఞాపించాడు.
ఆ బ్రాహ్మణ స్త్రీ సైనికులకు బాలుడుతో సహితం గా చేబ్రోలు వద్ద దొరికి పోయింది. బాలుడు రాయజగపతి ని చెరశాల లో వుంచవలసినది గా రుస్తుం ఖాన్ ఆజ్ఞాపించాడు. అంతట ఆ కొంపెల్ల మహా లక్ష్మి గారు నేనూ బాలుడితో సహా చెరలో ఉండేందుకు అనుమతించమని రుస్తుం ఖాన్ ను వేడుకుంది. చెర శాలలోనే ఉంటూ బాలున్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. రాయ జగపతి ని చెరనుండి విడిపించడానికి అహర్నిశలూ కృషి చేసింది.
రుస్తుం ఖాన్ బార్యతో సన్నిహితం గా ఉంటూ అదను చూసుకొని రాయ జగపతి రుస్తుం ఖాన్ వద్దనే బందీగా ఉన్నాడనే విషయం విజయనగరానికి చేర వేసింది.
రుస్తుం ఖాన్ ను తన సొంత కొడుకు నూరుద్దీన్ ఖాన్ చేతిలో నే దారుణంగా హత్య కావించబడ్డాడు.
విజయనగర మహారాజు పెద విజయరామ రాజు గారు పదివేల సైన్యంతో మరియు 2 వేల భోయీల తో నూరుద్దీన్ ఖాన్ పై దండెత్తి వచ్చి చేబ్రోలు దగ్గర పెద్దయుద్ధం చేసి నూరుద్దీన్ ఖాన్ ను హతమార్చి బాలున్ని చెరనుండి విడిపించి యుక్త వయస్సు వచ్చే వరకూ తమ వద్దనే ఉంచుకుని "నీమత్ ఆలీ” తో ఒప్పందం కుదుర్చుకుని పెద్దాపురం సంస్థానా నికి రాయ జగపతి ని రాజు చేసెను.
ఆ రకంగా ఎంతో సాహసంతో, తన ప్రాణాలకు తెగించి వత్సవాయ వంశాంకుర మైన తనను కాపాడినందుకు కృతజ్ఞతతో తాను సంస్తానాదీశుడైన వెంటనే కొంపెల్ల మహాలక్ష్మి గారి కి ఒక అగ్రహారాన్ని బహుమతి గా ఇచ్చారు. ఆ తరువాత రాజుగారి తాతగారు రాయపరాజు పేరుమీద అక్కడ ప్రతీ సంవత్సరం అనేక కార్యక్రమాలు, యజ్ఞ యాగాలు జరిగేవి. అందుచేత ఆ ఆగ్రహారానికి రాయభూపాల అగ్రహారం అని పేరు వచ్చింది. ఆ రాయభూపాల అగ్రహారమే ఇప్పటి రాయభూపాల పట్నం.
రాగవమ్మ చెరువు
ఆ తరువాత కాలంలో ఆ అగ్రహారమంతా పంటలు సుభిక్షం గా పండేందుకు వీలుగా రాయ జగపతి గారి నాయనమ్మ/ అగ్ని ప్రవేశం ఆత్మత్యాగం చేసుకున్న రాగమ్మ గారి పేరు మీద పెద్ద చెరువు త్రవ్వించినట్లు స్థానిక చరిత్రము నుండి తెలుస్తున్నది.
రత్నగర్భ వినాయకుడు.
అతి పురాతనమైన ఎంతో చరిత్రగలిగి తన పొట్టలో రత్నాలను దాచుకున్న శ్రీ రత్న గర్భ వినాయకుల వారికి రాజుల కాలం నుండీ కూడా ఎంతో వైబోగం జరిగిందని ప్రతీతి.
మీ వంగలపూడి శివకృష్ణ

CGK bhupathi, Peddpuram Father of Mahesh Bhupathi, Chennai

దిగ్గజాలకు దిక్సూచి - మన చిన గంధం కృష్ణ భూపతి








టెన్నీసు ప్రపంచానికి C.G.K భూపతి గా సుపరిచితులైన శ్రీ చిన గంధం కృష్ణ భూపతి గారి బాల్యం, విద్యాభ్యాసం, క్రీడాబ్యాసం అంతా పెద్దాపురం లోనే సాగింది.
చిన్నతనం నుండీ అతని టెన్నీసు ప్రాక్టీసు పెద్దాపురం 1902 లోనే బ్రీటీషు వారిచే నిర్మిపబడ్డ టౌన్ హాల్ లో ఉన్నటువంటి మట్టి కోర్టు లోనే జరిగింది.
ఈయన తండ్రిగారు శ్రీ చిన గంధం సూర్యనారాయణ మూర్తి గారు.
వీరి స్వగృహం లూధరన్ హై స్కూల్ ఎదురుగా (ఇప్పుడు ఆ స్థలం లో బాలాజీ కనస్ట్రక్షన్స్ , వారు నిర్మించిన అపార్ట్‌మెంట్ వుంది)
S.S.L.C వరకూ ఈయన విద్యాభ్యాసం 1963 పెద్దాపురం లూథరన్ హై స్కూల్ లోనే సాగింది.
• ప్రపంచ టెన్నిస్ దిగ్గజం తొమ్మిది సార్లు గ్రాండ్ స్లామ్ విజేత పద్మశ్రీ మహేష్ శ్రీనివాస్ భూపతి ఈయన కుమారుడే (DOB: జూన్ 07 – 1974, చెన్నై)
• స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి పద్మశ్రీ సానియా మీర్జా కి కోచ్ ఈయన
జాతీయ స్థాయిలో అనేక టెన్నిస్ పోటీలలో పాల్గొన్న భూపతి గారిని అనేక బహుమతులు వరించాయి.
1968 - 69 లలో శ్రీ లంక లో జరిగిన జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలలో అమ్రిత్రాజ్ మరియు యస్. ఎన్ మిశ్రా భాగస్వాములుగా వరుసగా 1968 ఫైనల్ లో బి. ఎల్ పింటో మరియు పి. యస్. కుమార లను 1969 ఫైనల్ లో B.L. వి ధావన్, శ్యామ్ మినోత్ర లను ఓడించి డబుల్స్ టైటిల్ విజయ కేతనం ఎగుర వేశారు.
1975 వ సంవత్సరంలో పురుషుల సింగిల్స్ మరియు డబుల్స్ విభాగాలలో రన్నరప్ గా నిలిచిన ఈయన టెన్నిస్ క్రీడను ఎంతగా ప్రేమించారంటే ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించడానికి చిన్న చిన్న అకాడమీ లతో మొదలై బెంగుళూరు మహానగరం లో టెన్నిస్ విలేజ్ నిర్మించేటంత.
భారత క్రీడారంగానికి ఎనలేని సేవలు చేస్తున్న మన C.G.K భూపతి గారు నిజంగా అబినంధనీయులు.............................................మీ వంగలపూడి శివకృష్ణ
***(తప్పులు ఉంటే తెలియజేయండి తప్పక సవరిస్తాను)***

Wednesday, 17 February 2016

Pandava Caves Peddapuram - పెద్దాపురం పాండవుల మెట్ట

పెద్దాపురం పాండవుల మెట్ట


ఆంధ్రుల అంతః పురమై అలరారిన అమరగిరిలో
చీకటి గుహల చెంత సూర్యుని సన్నిది 
భీముని పాదముద్ర గుహలో పాండవుల నిద్ర
ద్రౌపది మైల నేల నలభీముల పాకశాల

పుట్టిన ప్రతి బిడ్డకు పేరెట్టగ చెంచులు
మొక్కులు తీర్చగ మన్నెం మారాజులు
కళాకారుల వేల గొంతుల చేత 
కళావంతుల కాలి గజ్జెల మోత

వర్షాబావంలో వరదపాశ ఉత్సవం 
ఏటా మాఘంలో ఉజ్వల రధోత్సవం 
చుట్టూ చెట్ల నడుమ నూటేమ్మిది మెట్లు
నయనానంద మయిన ఆలయాల మిరుమిట్లు



















పూర్వ చరిత్ర : ద్వాపర యుగంలో కౌరవుల చేతిలో మాయా జూదం లో ఓడిపోయిన పాండవులు. పందెంలో షరతు ప్రకారం, పన్నెండేళ్ళ వనవాసాసం, మరియు ఒక సంవత్సరం అజ్ఞాత వాసంలో గడపాలి. 12 ఏళ్ళ వనవాసం భారతదేశం లోని వివిధ ప్రాంతాలలోనూ తర్వాత 1 సంవత్సరం అజ్ఞాత వాసం విరాట రాజు కొలువులో గడిపారని వనవాస సమయంలో పాండవులు దట్టమైన అరణ్యాలలో ఎత్తైన ప్రాంతాలు వెతికి అక్కడ నివాస యోగ్యం గా రాతితో/పెద్ద బండ రాళ్ళతో గుహలు నిర్మించుకొన్నారని వంట చేసుకోవడానికి అనుగుణంగా వంట శాలలు నిర్మించుకున్నారని ఇందులో బాగంగానే పెద్దాపురం లోని పాండవులు ఈ మెట్ట పై నివసించారని ప్రతీతి.
పాండవుల మెట్ట మీద ప్రత్యేకతలు అరుదైన విషయాలు:
ఆలయాల కలబోత - పెద్ద పెద్ద ముళ్ళ పొదలతో బారీ వృక్షాలతో నిండి పోయిన ఈ మెట్ట పై రాజయోగి పంచ ప్రణవనాద శ్రీ పాలూరి వెంకట సుబ్బారావు గారు అకుంఠిత దీక్షతో 1952లో సూర్యనారాయణ స్వామి దేవాలయం నిర్మించారు తరువాత ఈ క్షేత్రం దినదినాబి వృద్ది చెందుతూ ఇప్పుడు సకల దేవతా సమ్మేళనం గా విరాజిల్లుతుంది : 108 - అష్టోత్తర మెట్లెక్కి మెట్ట చేరితే అన్నీ ఆలయాలే - విఘ్నేశ్వరాలయం, వేద గాయత్రీ మాత ఆలయం, నవగ్రహలలోని రాహు, కేతువు, చంద్ర మరియు శనీశ్వర ఆలయాలు శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వరాలయం, వలీ సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరీ సమేత శివాలయం, సంతోషి మాత ఆలయం, కృష్ణా లయం, భీముని పాదాల ఎదుట హిడింభీ దేవి గుడి మెట్ట క్రింద బాగంలో ద్యాసాంజనేయ స్వామి వారి ఆలయం ఒక వైపు, అమరగిరి సత్తెమ్మ వారి ఆలయం మరో వైపు సందర్శకులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేస్తాయి
ప్రకృతి రమణీయత
పెద్దాపురం మొత్తాన్ని ఒక్క సారిగా చూడాలంటే పాండవుల మెట్ట ఎక్కాల్సిందే. 
గుహ ఎంట్రన్స్ పై భాగం నుండి సూర్యోదయం, 
భీముని పాదాలు దగ్గర నుంచి సూర్యాస్తమయం 
నిండు పున్నమి రోజు రాత్రి ఆకాశం 
కటిక అమావాస్య రోజు రాత్రి విద్యుత్ దీపాల వెలుతురు లో పెద్దాపురం ఊరు

గుహలు : మెట్ట మీద గుహలు ప్రత్యేక ఆకర్షణ పాండవుల గుహలు భారత దేశంలో తుంగనాథ్ - ఉత్తరాఖండ్,
మహాబలిపురం - తమిళనాడు,
ఘట్శిల్ - జార్ఖండ్,
మంగళూరు - కర్నాటక,
నాశిక్ - మహారాష్ట్ర,
పచంరాహి & పన్నా - మధ్యప్రదేశ్,
విరాట్ నగర్ - జైపూర్, 
గోవా - గోవా 
మన ఆంద్రప్రదేశ్ లో ని శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి తూర్పుగోదావరి జిల్లా లోని "పెద్దాపురం" లో ఉంటూ మహా బారత చరిత్రకు సాక్ష్యాలు గా నిలిచాయి.

పెద్దాపురం లోని గుహలు 
ఈ గుహలు ఎప్పటికీ ఒక మిస్టరీనే ఈ గుహలో పాండవులు నివశించారని ఈ గుహల ద్వారానే రాజమహేంద్రవరం గోదావరీ స్థానానికి తెల్లవారు జామునే బయలుదేరి సూర్యోదయానికల్లా తిరిగి వచ్చేసే వారని వీరి అనంతరం ఆ గుహలు రాక్షసులకు నివాసం గా మారిందని ఆది శక్తి అంశ రాక్షస సంహారం కావించి ఋషులకు మహర్షులకు తపో ప్రదేశం గా మార్చిందని కలియుగంలో ఈ గుహ వింత జంతువులకు విష సర్పాలకు, తోడేళ్ళకు ఆవాసం గా మారిందని కధనం (నిజా నిజాలు శ్రీ సూర్య నారాయణునికే ఎరుక). ఇటీవలి కాలంలో గుహ అంతా గబ్బిలాలతో నిండి ఉండి గబ్బు వాసన వచ్చి సందర్శకులు లోనికి వెళ్ళలేక పోయేవారు ఇప్పుడు గబ్బిలాలు ఏమి లేవు ఎవరైనా గుహ చివరి బాగం వరకూ వెళ్లి చూడవచ్చు. ఈ గుహలను సందర్శించడానికి అనువుగా రోడ్డు నుండి కొంత దూరం మేర వాహనాల మీద వచ్చి అక్కడ నుండి 63 మెట్ల సాయంతో చేరుకోవచ్చు).

పాండవుల పాకశాల (వంటశాల) : భీముడు బోజన ప్రియుడే కాదు షడ్రుచోపేతమైన వంటలు బహుపసందుగా చేయడంలో అందే వేసినచేయి గుహకు అతి దగ్గరగా చిన్న గుహ మాదిరిగా రాతిని వొలిచిన ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ పాండవులు భోజనాల తయారీకి వాడుకున్నారని చారిత్రక కథనం. ఈ ప్రాంతంలో కనిపించే డొప్ప వంటి భాగాన్ని గంజి వార్చే భాగము' గా వర్ణిస్తారు..
ద్రౌపది రజస్వల చాప
పాండవుల పాకశాల గుహల ప్రక్కనే చతురస్రాకారంలో చాప మాదిరి రాతి నిర్మాణం కనిపిస్తుంది.సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు బహిస్టు సమయంలో గృహ సంబంధిత కార్యక్రమాలకు దూరంగా వుంటారు ఆచార సంప్రదాయాలను అత్యంత నిష్టగా పాటించేవారు నేటికీ బహిష్టు రోజులను అపవిత్ర రోజులుగా భావించి వేరుగా ఏదో మూలన గృహ కార్యక్రమాలకు దూరంగా గడపడం జరుగుతుంది. ఆ దినములు గడిచిన తర్వాత మంగళకర స్నానం ఆచరించి గృహ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆచారంగా వస్తోంది. 
సాధారణ వయసులో సంభవించే రజస్వల సంభవించని ఆడపిల్లలను పాండవుల మెట్ట ఈ ద్రౌపది రజస్వల చాపవద్దకు తీసుకువచ్చి దానిపై కూర్చుండబెడితే వారు రజస్వల అవుతారన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది.

రిపీటర్ టవర్ : తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం పెద్దాపురం అలాంటి ఒక పెద్దాపురం లో పాండవుల మెట్ట దాదాపు 200 అడుగుల ఎత్తు ఆ మెట్ట మీద రెండు టవర్ లు ఒకటి రెవిన్యూ రెపీటర్ టవర్ & పోలీస్ కమ్యూనికేషన్ టవర్ వాటి ఎత్తు దాదాపు 150 అడుగులు ఇలా ఆంద్ర రాష్ట్రానికే అత్యంత ఎత్తులో ఉన్న ఈ టవర్ పరిధి రాష్ట్రం అంతటా వ్యాపించి వుంది. ఒకప్పుడు ఇక్కడ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం మకాం వేసుకుని వుండేది
వరద పాశ ఉత్సవం : సకాలంలో వర్షాలు కురవకపోతే పట్టణంలోని అన్ని వీధులకు చెందిన రైతులు పాండవుల మెట్ట పై వరదపాసం నిర్వహిస్తారు. పట్టణంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, అధికంగా నివసించే ప్రాంతాలవారు కోడెగిత్తలను, ఆంబోతులను అలకరించి భజనలు చేస్తూ, పాటలు పాడుకుటూ పాండవుల మెట్టపైకి ఊరేగింపుగా వెళ్లి మెట్టపై పాలు పొంగించి పరమాన్నం వండి వరుణ దేవుడికి నైవేద్యం పెడతారు.
సుద్దకొండలో క్షుద్ర పూజలు (నిధుల అన్వేషణ) 
పాండవుల మెట్ట మరియు సమీపం లోని గవ్వల మెట్ట, పైరింగ్ మెట్ట మరియు పాత పెద్దాపురం కోటముందు సమీపంలోని చిన్న మెట్ట అంతా సుద్దతో నిండిన ప్రాంతాలు కావడం వల్ల సుద్ద త్రవ్వకాలు జోరుగా జరిగేవి - రాజులు నివసించిన ప్రాంతం కావడంతో అడపా దడపా కొన్ని చోట్ల బంగారు నాణేలు దొరికాయన్న వదంతులు వ్యాపించడంతో నేటికీ కొంతమంది గుప్త నిధుల అన్వేషణ కావిస్తూనే వున్నారు మూఢ నమ్మకాలతో పిచ్చి పిచ్చి పూజలు (క్షుద్ర పూజలు) చేయిస్తూ సుద్దకొండను త్రవ్వుతూ చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు

జరిగే కార్యక్రమాలు :
నిత్య దర్శనం 
మాఘ మాసం 30 రోజులు విశేష పూజలు - భక్తుల గోత్ర నామాలతో అర్చనలు.
రధసప్తమి వేడుకలు సూర్య నారాయణ స్వామి వారి కల్యాణం 
ప్రతీ శివరాత్రికీ స్వామీ వారికి మహా రుద్రాభిషేకం, లక్షబిళ్వార్చన .
వర్షాలు కురవని సమయాలలో వరద పాశ ఉత్సవం

తప్పకుండా ఈ దివ్య క్షేత్రాన్ని దర్శిస్తారని ఆశిస్తూ....... మీ వంగలపూడి శివకృష్ణ

Kattamuru A Beautiful Village in Peddapuram Consistency పెద్దాపురం సంస్థానం కట్నం - వూరు "కట్టమూరు"

పెద్దాపురం మహారాజా వారు శ్రీ రామునికి కట్నం గా సమర్పించిన వూరు కట్టమూరు


 వర్ణించ తరమా ఈ వూరి సొగసులు 
ఏలేరు వంపులు 
పచ్చని పైరులు 
పైరులకి కొలనులు 
పశువులకు చెరువులు
ఊరి మద్యలో జోడుగుళ్ళు 
ఊరి నిండా పెంకుటిల్లు 
కల్మషం లేని మనుషులు









పెద్దాపురం మహారాజా శ్రీ రాజా రాయపరాజ మహారాజు గారు(1607-1649)

శ్రీ రామునకుఁ కట్టమూరున గట్టించే గుళ్ళూ గోపురములు మంటపములు,
గంభీర జల తటాకమును త్రవ్వించె గృహస్తపురంబున సుస్థిరముగఁ
బొలుపుగా వాల్మీకిపురి కాండ్రకోటను ఫలభూజవాటికల్ పదిలపరచే"

అని ఏనుగు లక్ష్మణ కవి రచించిన రామ విలాసము లో ఇలా వర్ణించాడు

గుడులు గోపురములు : 
పట్టాభిరాములవారి గుడి మరియు కేశవ స్వాములవారి గుడి, శివాలయము, వినాయకుని గుడి, షిరిడి సాయిబాబావారి దేవాలయము, వీరబ్రహ్మం గారి ఆలయము, ఊరి మొదట్లో కనకదుర్గ గుడి, ఊరి చివరన పోలేరమ్మ తల్లి ఆలయము, ఇంకా శ్రీరాముని కోవెలలు, ఆంజనేయుని గుడులు కలవు.

చెఱువులు : 
మంచి నీటి చెఱువు, రాయన చెఱువు, బాపనవీధి చెఱువు, కిత్తా చెఱువు, గంగరావి చెఱువులు

పాఠశాలలు : 
ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మూడు మండల ప్రజా పరిషత్ పాఠశాలలు

Anivilla Venkata Sastry - of Peddapuram Pricely State పెద్దాపురం సంస్థానం - శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి

శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి - ’చిత్ర చమత్కార మంజరి ‘’ని పెద్దాపురం మహారాజుా వత్సవాయి తిమ్మ జగపతి రాజు గారికి కి అంకితమిచ్చారు.



పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్తికి చెందిన ఆణివిళ్ళ నారాయణ కవి కుమారుడే ఆణివిళ్ళ వేంకట శాస్త్రి. ఈయన 18 వ శతాబ్దానికి చెందినవాడు. బాల కాళిదాస బిరుదాంకితుడైన శ్రీ ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారు సర్వ శాస్త్ర పారంగతుడు సకల శాస్త్ర వైదుష్యం ఉండటం చేత పెద్దాపురం సంస్థానం మహా ప్రభువులు, దార్లపూడి, విజయనగర మహా రాజుల చేత గొప్ప సన్మానాలు పొందాడు .
’’మహేశ్వర మహా కావ్యం ,
సతీ స్తోత్రం ,
భాస్కర ప్రశస్తి ,
రుక్మిణీ పరిణి కావ్యం రాశాడు .
వేంకట శాస్త్రి గారు గొప్ప అలంకారికులు
’’అలంకార సుధా సింధు ‘’,
’’రస ప్రపంచం ‘’ఆతని శేముషికి నిదర్శనాలు . ‘’చిత్ర చమత్కార మంజరి ‘’ని పెద్దాపురం రాజు వత్సవాయి తిమ్మ జగపతి కి అంకితమిచ్చాడు .చిత్ర కవిత్వముగా ‘’సూర్య శతకం ‘’రాసాడు. . శ్రీ ఆణివిళ్ళ వేంకటశాస్త్రి గారికి వార్ధక్య దశలో పెద్దాపురం సంస్థానం వారు అగ్రహారం ప్రసాదించాలని సంకల్పించగా అప్పటి మంత్రి పాణంగిపల్లి రామచంద్రుడు గారి కుతంత్రము వల్ల నెరవేరలేదట.... పాణంగిపల్లి రామచంద్రుడు తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలానికి చెందిన పాణంగిపల్లి, గ్రామము ను అగ్రహారంగా పొందే నిమిత్తం అలా చేసాడని లోకోక్తి.
నూజివీడు జమీందారులు మేక వెంకట నరసింగ అప్పారావుపై ‘’అప్పారాయ యశశ్చంద్రో దయ కావ్యాలు రాసాడు. మెచ్చిన రాజు వల్లూరుమల్లి అగ్రహారాన్ని ప్రదానం చేసాడు. అక్కడ సోమయాగం చేసాడు. “శ్రౌత సూత్రాలు” పై భాష్యమ్ రాసాడు

Friday, 12 February 2016

Big Market - Fail of Peddapruam పేదల అవసరాలు తీర్చే పెద్దాపురం సంత

 పేదల అవసరాలు తీర్చే పెద్దాపురం సంత





షాపింగ్ మాల్స్ లా కనిపించే తాత్కాలిక దుకాణాలు
తిరనాళ్ళను తలపించే జన ప్రవాహం
             పెద్దాపురం లో ప్రతీ ఆదివారం జరిగే వారాంతపు సంతకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి 250 సంవత్సరాలపైనే చరిత్ర ఉంది.  ప్రతీ శనివారం సాయంత్రం నుంచే ఇక్కడ సందడి మొదలై ఆదివారం ఉదయం 6 గంటల నుంచీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటుంది. ఆదివారం అందరికీ సెలవు దినం కావడంతో అదే రోజు  సంత నిర్వహిస్తుండటంతో పెద్దాపురం ప్రజలే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా వేల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తారు.  ధనిక - భీద భేదం లేకుండా క్రమం తప్పకుండా ప్రతీ వారం సంతకి వెళ్ళడం ఇక్కడి ప్రజలకు వ్యాపకం(అలవాటు)


 చుట్టు ప్రక్కల అనేక గ్రామాలనుండి రైతులు, వ్యాపారులు ఇక్కడకు వచ్చి తాజా కూరగాయలు, పండ్లు మరియు అనేక ఇతర నిత్యావసర వస్తువులు అమ్ముతారు, చిరు వ్యాపారులు రైతులతో పాటు రోడ్డుపై కూర్చొని దుప్పట్లు, స్వెటర్లు , రెడీమేడ్ బట్టలు, ప్లాస్టిక్ , స్టీల్ సామగ్రి , చెప్పులు, తిను బండారాలు విక్రయిస్తారు. సంచార వ్యాపారులు సైతం వినియోగదారుల అవసరాలు గుర్తించి, అవసరమైన వస్తువులను తీసుకుని వచ్చి  సంతలో విక్రయిస్తున్నారు. ఈ సంతలో తక్కువ ధరకు కావాల్సిన వస్తువులు దొరుకుతుండటంతో పేద, మధ్య తరగతి ప్రజలు వారానికి సరిపడా సరుకులతో పాటు ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేయడానికి ఆదివారం వరకూ ఆగి కొనుగోలు చేస్తారు.

సంతకి వచ్చిన జనం  చదలాడ బెల్లం - చోడవరం చింతపండు - రంప చీపుర్లు -  గొల్లప్రోలు ఉల్లిపాయ - పెద్దాపురం పాలకోవా - నాటు కోళ్ళు  - పచ్చి చేపలు - ఎండు చేపలను ఎగబడి కొంటారు.                      

Thursday, 11 February 2016

First Poet of Peddapuram పెద్దాపురం తొలి కవి పండితులు: వెణుతురుబల్లి విశ్వనాధ కవి


తొలి కవి పండితులు: వెణుతురుబల్లి విశ్వనాధ కవి 


                   

పెద్దాపురం సంస్థానమును చతుర్భుజ తిమ్మ జగపతి గారు పరిపాలించే కాలంలో 1600 ప్రాంతం వాడగు శేష ధర్మములు అనే పద్య కావ్యమును రచించి గారికి అంకితం ఇచ్చారు 
విశ్వనాధ కవి యార్వేల నియోగి వెంకటామాత్యుల వారి కొడుకు అంతే కాదు బర్తృహరి సుభాషిత రత్నావళి రచించిన ఏనుగు లక్ష్మణ కవి గారి తాత అయినటువంటి ఏనుగు పెదలక్ష్మణ కవి గారికి మేనమామ (ఏనుగు పెదలక్ష్మణ కవి గారు ద్రౌపదీ పరిణయం అనే ప్రభంధమును రచించారు)
ఇతను శ్రీరామ విజయము అనే యక్ష గానం - 
గౌరీ వివాహం అనే ద్విపద ప్రభందము ను 
హరీశ్చంద్ర చరితము అనే నిర్దోష్ట్య ప్రభందము ను 
పారిజాతాపహరణం ను సంస్కృతం లోనూ రచించినారు దురదృష్టవ శాత్తూ ఈయన రచించిన గ్రంధాలన్నీ కూడా కాల గర్భంలో కలిసిపోయినవి కానీ ఏనుగు లక్ష్మన కవి గారి గ్రందాల ద్వారా వెణుతురు బల్లి విశ్వనాధ కవి గారి గొప్పతనాన్ని తెలుసుకొనవచ్చు

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...