Monday, 18 January 2016

లూథరన్ హైస్కూలు - Luthern High School Peddapuram - L.H.S Peddapuram

మన పెద్దాపురం లూథరన్ హైస్కూలు 


వంద సంవత్సరాల ఈ స్కూలు
నిరంతర విద్యాప్రగతికి ఆనవాలు
పెద్దాపురం లూథరన్ హైస్కూలు
స్థాపించిన ఎడ్మన్ ఇమ్మానుయెల్ కి జేజేలు
ఈ స్కూలు పేరు పేరు చెప్తే పులకించే పూర్వ విద్యార్ధుల సాక్ష్యం
శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును అనే భవనం మీద వాక్యం.
కోత పండుగ
క్రిస్మస్ వేడుక
కళా వేదిక
క్రీడా కూడిక
'H' ఆకారం భవంతి
గాలికి వేళ్ళాడే స్కెలిటన్
పీటర్ మాస్టారి ఫుట్ బాల్ అసోసియేషన్ ….

ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో మదుర స్మృతులు ఇక్కడ చదివిన విద్యార్థులకే కాదు పెద్దాపురం లోని ప్రతి విద్యార్ధికీ ……………………… ఇలా


పెద్దాపురం చరిత్ర లో చెరగని ముద్ర వేసి తనకో పేజీ లిఖించుకొని ఎందరో విద్యార్ధులకు అశాదీపం అయిన లూథరన్ హైస్కూల్ చరిత్రలోని కొన్ని మైలు రాళ్ళు మీకోసం …….



అక్షరాస్యతా శాతం లో అట్టడుగు స్థాయిలో ఉన్న పెద్దాపురాన్ని విద్యాపురంగా వెలుగొందించాలన్న ఆశయంతో ఎడ్మన్ మహాశయుడు (Dr. Edman Emmanuel. M.D డా \\ ఎడ్మన్ ఇమ్మానుయెల్ ఎం డి) 1891 లో ఒక ఇల్లు ని అద్దెకి తీసుకుని ప్రైమరీ స్కూల్ ని స్థాపించడం జరిగింది.

ఆ తరువాత రెవ హెచ్ ఇ. ఇసాక్సన్ H.E. Isaac-son గారు 1897 లో స్కూలుని నాలగవ తరగతి వరకూ పెంచగా....!

శ్రీ మద్దిరాల రామారావు పంతులు గారు లూథరన్ హైస్కూలు మొట్టమొదటి హిందూ మరియు భారతీయ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఘనత వహించారు.

16-02-1900 సంవత్సరం లో ప్రభుత్వ గుర్తింపు పొంది 475 మంది విద్యార్ధులు మరియు 18 మంది గురువులతో పూర్తి స్థాయి విద్యాలయంగా ఆవిర్బవించింది. (ఒక మిషినరీ స్కూల్ లో టీచర్స్ అందరూ హిందువులే కావడం గొప్పవిషయం)

రెవ కె ఎల్ వాల్టర్స్ (Rev. K.L. Walters) గారు ఈ స్కూల్ కి 6 ఎకరాల స్థలమును సంపాదించి ఇవ్వగా 1906 లో ఇప్పటి బ్రాంచి స్కూలు ఉన్న ఒక భవనం ను కొని దానికి మరమత్తులు - మార్పు లు చేర్పులు చేయించడం ( రీ మోడలింగ్) స్కూల్ మిషనరీ నుండి మిషన్ కౌన్సిల్ కి మార్పు చెందడం వడి వడి గా జరిగి పోయాయి.


పాఠశాల భవనం నిర్మించేందుకు 25.11.1911 న శంఖుస్థాపన చేసి 29.10.2012 నాటికి H - ఆకారంలో వుండే ఒక బారీ భవంతిని రూ. 38000/- వ్యయంతో నిర్మించడం జరిగింది. (ఈ స్కూల్ నిర్మాణానికి కావాల్సిన రూ 38000/- డబ్బు కోసం "రెవ హుస్స్" (Rev Huss - మహాశయుడు తనకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భూమిని అమ్మి ఇవ్వడం జరిగింది.)

రెవ హెచ్ హెచ్ సిపెస్ (Rev. H.H. Sipes) గారు ఈ స్కూలు కి మొట్టమొదటి మేనేజర్ గా 1912 నుండి 1917 వ సంవత్సరం వరకూ సేవలందిచగా.



First Ncc Officer of Luthern High School Mr. Rudra Raju

1932 శ్రీ వి సి హెచ్ జాన్ గారు మొట్టమొదటి ఇండియన్ మేనేజర్ గా ఘనత వహించి 1936 లో ఈ స్కూలు యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకను ఘనంగా నిర్వహించారు.



1945 లో శ్రీ ఎ డానియెల్ గారు ప్రధానోపాధ్యాయులు గా ఉన్న కాలాన్ని పెద్దాపురం లూథరన్ హై స్కూల్ కి స్వర్ణ యుగం గా చెప్పవచ్చు 55 మంది టీచర్స్ , 768 విద్యార్ధినీ - విద్యార్ధులు మరియు స్కూలుకి చేర్చి ఉన్న భవనంలో 87 మంది విద్యార్ధులతో స్కూలు కళకళలాడిపోయేది.




1954 నుండీ 1965 వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన ఎం ప్రకాశం గారు స్కూలుని కేవలం విద్యకే పరిమితం చేయకుండా (ఎక్ష్రా కర్రిక్యులర్) - క్రీడలు - కళలు కి కూడా సమాన ప్రాధాన్యాన్నిచ్చి విద్యార్ధులు అన్ని రంగాలలోనూ నిష్ణాతులయ్యేలా ప్రోత్సహించారు.


ఆ ప్రయత్నం లో భాగంగానే అల్ ఇండియా జమ్బోరీ - (స్కౌట్) ని 1964 వ సంవత్సరంలో స్కూల్ కి తీసుకురావడం - స్కూల్ కి ఒక జెండాను రూపొందించడం - శ్రీ అర్. సూర్యనారాయణ గారు ( ఆర్ట్ & స్కౌట్ టీచర్) గారిచే స్కూలుకి ఒక గేయాన్ని రచింప చేయటం ( స్కూల్ సాంగ్) జరిగింది.


శ్రీ బి శామ్యూల్ గారు 1967 నుండి 1976 సంవత్సరం వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి స్కూలు కి నాచురల్ సైన్స్ లాబోరేటరీ ని నిర్మించి డైమండ్ జూబ్లీ వేడుకలను 1975 సంవత్సరం లో ఘనంగా నిర్వహించారు.


1978 నుండి 1991 వరకూ వి ఎస్ డేవిడ్ రాజు గారు ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి అదనపు సెక్షన్స్ ను ఉద్యోగులను నియమించి సుదీర్ఘ కాలం స్కూలుకి సేవలందించిన వ్యక్తిగా గుర్తింపు పొందడం జరిగింది.


1991 నుండి 1994 వరకూ జాన్ పీటర్ గారు ప్రధానోపాధ్యాయులు గా విధులు నిర్వహించడం జరిగింది. పీటర్ గారు స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నప్పుడే ఫుట్ బాల్ అసోషియేషన్ ను స్థాపించి విద్యార్ధులకి విద్యార్ధులకి శిక్షణ ఇచ్చేవారు. ఈయన హయాం లోనే 1992 లో సెంటినరీ ఇయర్ అఫ్ లూథరన్ హైస్కూలు ని ఘనంగా నిర్వహించి స్కూలు స్థాపకుడు అయినటువంటి డా ఎడ్మన్ ఇమ్మానుయెల్ గారి విగ్రహం స్కూలు ఆవరణలో ఆవిష్కరించడం జరిగింది.




1995 నుంచి 1998 వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన ఎం శ్యాం సుధాకర్ గారు (ఎం. ప్రకాశం గారి తనయుడు) లూథరన్ బ్రాంచ్ ని లూథరన్ హై స్కూలుని క్లబ్ చేసి విద్యార్ధుల సౌకర్యార్ధం అదనంగా స్కూలు వెనుక బాగం వైపు ఆరు తరగతి గదులను నిర్మించడం జరిగింది.


1998 నుండి 2003 వరకూ ప్రధానోపాధ్యాయులు గా పనిచేసిన వి జె ఎస్ పాలన్ గారు స్కూలు భవనం యొక్క పైకప్పు (రూఫ్) ని ధృడంగా ఉండేలా మార్చి - తలుపులు కిటికీ లు బలంగా ఉండేలా ఏర్పాటు చేయించడం జరిగింది.


2003 నుండి 2006 వరకూ జి నళిని గారు ప్రధాన ఉపాద్యాయురాలు గా పనిచేసి స్కూలుకి సైన్స్ & సాస్కృతిక విభాగాలలో అనేక అవార్డులు సంపాదించి పెట్టి 2005-2006 విద్యాసంవత్సరానికి గానూ ఉత్తమ ఉపాద్యాయురాలు బహుమతి ని అందుకోవడం జరిగింది అంతే కాకుండా . స్కూలుకి డబుల్ క్లాస్ రూం వసతిని కల్పించి కళావేదిక (స్టేజి) పైకప్పు ని ఏర్పాటు చేయించారు.


2006 నుండి 2011 వరకూ ప్రధాన ఉపాద్యాయురాలు గా పనిచేసిన ఎస్ మేరీ గ్రేస్ గారు ముందు ఉన్నటువంటి పాత భవనాన్ని పాక్షికంగా తొలగించి ఇప్పుడు బయటికి కనిపించే పెద్ద భవనాన్ని 2011 లో తన ఉద్యోగ కాలం చివరలో నిర్మింప చేయడం జరిగింది.


2011 లో స్కూలు కరస్పాండెంట్ బి. జాన్ పీటర్ గారు స్కూలు భవనం యొక్క వంద సంవత్సరాల వేడుక (సెంటినరీ ఇయర్ అఫ్ ది స్కూల్ బిల్డింగ్) ని 31.10.2011 న నిర్వహించడం జరిగింది మరియు గోలి రామారావు గారి అద్యక్షతన పూర్వ విద్యార్ధులంతా ఒక కమిటీ గా ఏర్పడి స్కూలు భవనాన్ని పటిష్ఠ పరచాలనే నిర్ణయాన్ని తీసుకుని తదనుగుణంగా ప్రణాలికలు సిద్దం చేసుకోవడం జరిగింది.


మీ వంగలపూడి శివకృష్ణ

Temple at Peddapuram Pandavula Metta - Amaragiri Sattemma మన పెద్దాపురం అమరగిరి ‘అమ్మ - శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు :

మన పెద్దాపురం అమరగిరి ‘అమ్మ - శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు :

గ్రామ దేవత గా పిలవబడే శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు మన పెద్దాపురం జగ్గంపేట వెళ్ళే మార్గ తొలిలో శ్రీ శక్తిపీఠం నందు కొలువై ఉంది..
ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అనగా సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు ఉత్సవాలు జరగడం ఆనవాయితీ.ఈ సంవత్సరం కూడా ఏంతో వైభవంగా ఉత్సవాలని నిర్వహించడానికి ఆలయ కమిటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది



ఆలయ విశేషాలు :
------------------
1.మన పెద్దాపురం చారిత్రిక గిరుల అయిన "అమరగిరి" (పాండవులమెట్ట) చెంతన ఈ శక్తిపీఠం వుండడం విశేషం..
2. ఓం ఐం హ్రిం శ్రీం శ్రీ సత్యాంబికాయైనమః’ అన్న మంత్రోచ్చరణతో విరాజిల్లుతుంది ఈ ఆలయం
3. ఈ ఆలయం చుట్టూ అష్టదిక్కులయందు నాగుల విగ్రహాలతో నాగదిగ్బంధనం ఉంటుంది
4.ఆలయ ప్రాంగణంలో అష్టోత్తర- శత నామావళిలతో దేవీ కీర్తించబడుతుంది. ఈ ఆలయంలో త్రిభైరవమూర్తులు కొలువై వుండడం కూడా చెప్పుకోదగ్గ విషయం. కాలభైరవ.. వటుక భైరవ.. స్వర్ణాకర్షణ భైరవ రూపాల్లో భైరవమూర్తి దర్శనమిస్తాడు.
5. స్ఫటిక విఘ్నేశ్వరుడు యిక్కడ చాలా ప్రసిద్ధి ..
7. ఈ ఆలయం నందు ఉండు ఉప ఆలయం నందు శ్రీ వరాహి అమ్మవారు నిజరూపంలో ప్రతిరోజు తెల్లవారుఝామున గం.4 నుండి గం.5వరకు భక్తులకు దర్శనం లభిస్తుంది.
8.శ్రీ శక్తిపీఠంనందు శ్రీ చక్రయంత్ర సహిత వనదుర్గాదేవికి ఘనంగా యజ్ఞయాగాదులను నిర్వహించడం జరుగుతుంది.
9.దూప.. దీప.. నైవేద్య ప్రసాదాలతో నిత్యం అలరారే శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ అమ్మవారు జాతర సమయంలో గరగ ప్రభలతో భక్తులకు దర్శనమిస్తారు.
ఆ తల్లి దీవెనలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ!!
మన పెద్దాపురం TeaM

పెద్దాపురానికి ఆ పేరు ఎలా వచ్చింది.... ? History Behind Name of Peddapuram

 పెద్దాపురానికి ఆ పేరు ఎలా వచ్చింది.... ? 


అనే విషయం లో భిన్న కధనాలున్నాయి.

పెద్దాపురం ను పెదపాత్రుడు ఆక్రమించుకొన్నాడు - పెద్దాపురం పేరే మార్చేయాలి అనే వాదనలూ ఉన్నాయి ....

అవి పక్కన పెడితే పెద్దాపురం పేరుకి సంబంధించి కిమ్మూరు కైఫీయతు - పెద్దాపురం సంస్థాన చరిత్రము లనుండి నేను అర్ధం చేసుకున్నది తెలియజేస్తున్నాను - తప్పులు వుంటే పెద్దలు దయచేసి తెలియచేయండి సరిచేస్తాను.


పార్ధాపురం >>>>> కిమ్మూరు సీమ >>>>>> పొర్లునాడు >>>>>>> పెద్దాపురం
---------------------------------------------------------------------------------------------------

పార్ధాపురం:
పురాణాలు, స్థానిక చరిత్రల ప్రకారం పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడ నివశించడం జరిగింది
(దానికి సాక్ష్యాలు ఇంకా "అమరగిరి - పాండవుల మెట్ట" మీద సజీవంగానే వున్నాయి).
పాండవ మధ్యముడు అయినటువంటి అర్జునుడి పేరు మీద (అర్జునుడి కి పార్ధ అనే పేరు కూడా వున్నది) "పార్ధాపురం" అనే పేరుతో ఈ ప్రాంతమంతా పిలువబడేది. కాలక్రమంలో ఈ "పార్ధాపురం" కాస్తా వ్యవహారం లో (పలుగాకుల నోల్లబడి) "పెద్దాపురం" గా స్థిరపడింది.



కిమ్మూరు :

పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు పెద్దాపురం ఉన్న ప్రాంతాన్ని పెద్దాపురం పరిసర ప్రాంతాలను కిమ్మెరుడు అనే కిరాత రాజు పరిపాలించే వాడు ఆ కారణం చేత ఈ ప్రాంతమంతా అతని పేరునే కిమ్మూరు సీమ గా వ్యవహరింపబడేది (కిమ్మెరుని వధ కధ కోసం నా కాండ్రకోట ని కన్నులారా చూతము రారండి ని చూడండి)


పొర్లునాడు :
పెద్దాపురం పిఠాపురం ల మద్య ఏలేరు నది ప్రవహించడం మూలాన ఆంధ్రరాష్ట్రం అంతా ఈ రెండు ప్రాంతాలను పొర్లునాడు అని పిలిచేవారు.




పెద్దాపురం పేరు వెనక వృత్తాంతం :
ఈ ప్రాంతం గజపతిల ఆదీనం లోనికి రాకముందు రెడ్డిరాజులు పాలించేవారు అల్లాడ వేమారెడ్డి వంశం లోని వాడైన రెడ్డి వెంకటప్పనాయుడు కిమ్మూరు, కొవ్వాడ, గురుగుమిల్లి, గూటాల, క్రొత్తపల్లి ని పరిపాలిస్తున్నప్పుడు అతని సరదారు గా ఉన్నటువంటి ఇసుకపల్లి పెరుమాళ్ల పాత్రుడు అధీనంలో ఈ కిమ్మూరు సీమ వుండేది.

ఇతని అనంతరం ఇతని వంశంలోని వాడే అయిన " పెద్దాపాత్రుడు "** సిబ్బంది కి, సైన్యానికి అయిన వ్యయం పోగా మిగిలిన ఆదాయమంతా తమకి పంపాలనే ఒప్పందం మీద రెడ్డి రాజుల ఆమోదంతో ఈ కిమ్మూరు సీమకి పరిపాలకుడయ్యెను.

ఆ తరువాత అప్పటి కిమ్మూరు సీమ లో బాగంగా వున్నా తమిరే అనే గ్రామానికి ఉత్తర బాగాన ఉన్నటువంటి రెండు పెద్ద పెద్ద మెట్టలని చదును చేయించి అక్కడ ఒక్క కోటని కట్టించి చుట్టూ మట్టి గోడ పెట్టించి వాటిపై చుట్టూ బురుజులు తీర్పించి ఆ కోటలో అతను నివాసముంటూ ప్రజలు నివశించ దానికి వీలుగా ఒక పేటను కట్టించి దానికి అతని పేరు మీదనే " పెద్దాపురం "** అని పేరు పెట్టాడు.

చుట్టూ పక్కల ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలవడంతో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం కావడంతో ఇక్కడికి జనాల వలసలు పెరిగాయి. (ఆ తరువాత కాలంలో నీటి సమస్యల ఇక్కడినుండీ వలస పోయారు చాలామంది) తరువాత విస్సమ్మ అనే రెడ్డి వనిత రెండువేల పౌజులకు వత్సవాయి ముసలి తిమ్మరాజు గారికి (చతుర్బుజ తిమ్మ జగపతి మహారాజు) గారికి తాకట్టు పెట్టడం జరిగింది.

ఆ తరువాత వత్సవాయి వంశస్తులు పెద్దాపురాన్ని సుబిక్షంగా పరిపాలించిన విధానం మీకు తెలిసిందే ...... !

తప్పులు వుంటే మన్నించండి సవరణలు తెలియజేస్తే తప్పక సరిచేయగలను

....................................................................ఇట్లు మీ వంగలపూడి శివకృష్ణ

A Painful Story about Ragavamma Peddapuram - పెద్దాపురం సంస్థానం : పరమ సాధ్వీ మణి - త్యాగశీలి రాగమ్మ గారు :

పెద్దాపురం సంస్థానం : పరమ సాధ్వీ మణి - త్యాగశీలి రాగమ్మ గారు :


కటిక రాయికైనా కన్నీరు తెప్పించే రాగమ్మగారి జీవిత కధ తప్పక చదవాల్సిందే
భారత దేశంలో వీరనారీ మణుల చరిత్రలు కోకొల్లలు ... అదే కోవకి చెందుతుంది మన పెద్దాపురం రాగమ్మగారి గారి చరితం.
బార్యగా అమ్మగా మహారాణీగా పరువు నిలుపుకునే ప్రయత్నంలో ప్రాణత్యాగానికి పాల్పడ్డ పరమ సాధ్వీ మణిగా ఆమె చరిత్రలో నిలిచి పోయింది.
రుస్తుం ఖానుండి విద్రోహానికి బలి అయ్యిపోయిన రాగమ్మ గారి జీవిత చరిత్ర చదివితే కటిక రాయికైనా కన్నీరు రాక మానదు 




గొట్టుముక్కల భగవాన్ రాజు గారి ముద్దుల కూతురు అయిన శ్రీ గొట్టుముక్కల రాగమ్మ గారు వత్సవాయి ఉద్దండ రాయజగపతి బహద్దరు గారిని వివాహం చేసుకుని తిమ్మ రాజ జగపతి, భలబద్ర రాజ జగపతి, సూరపరాజు అనే ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది. ఉద్దండ రాయుడు గారు పెద్దాపురం సంస్థానాన్ని 1688 నుండి 1714 వరకూ పరిపాలించి 1714 లో కన్ను మూసే సమయానికి పెద్ద కుమారుడైన తిమ్మరాజ జగపతికి 10 సంవత్సరాలే కావడంతో, ముగ్గురు కుమారులు మైనరులు కావడం వల్ల - పెద్దకుమారుని సింహాసనాన్ని అధిష్టింప చేసి అతని పేర రాగమ్మ గారే 1714 నుండి రాజ్య పాలన కావించారు.పేద ప్రజారహిత పెద్దాపురం ప్రాభవాన్ని కాంక్షించిన పరమ సాధ్వీమణి రాగమ్మ గారు పెద్దాపురం తాలుకాలో రాగంపేట గ్రామాన్ని మరియు అక్కడికి దగ్గరలో ఉన్న రాగమ్మ చెరువు ఈమె చలవ వలననే ఏర్పరచ బడినవి.


రుస్తుం ఖాన్ విద్రోహ చర్యకి బలి అయిపోయిన రాగమ్మ
రుస్తుం ఖాన్ పెద్దాపురం కోటని ఆక్రమించుకోవాలనే కుతంత్రంతో పాడవుల మెట్ట దగ్గరకి వచ్చి వేచి వుండి తన కుమారుడైన నూరుద్దీన్ ఖాన్ ను రాగమ్మ గారి వద్దకి పంపి రాజ్యం - రాజ్య వ్యవహారాలకి సంబంధించిన విషయాలు మాట్లాడడానికి రాజకుమారులను పంపించాల్సిందిగా కోరాడు (నూరుద్దీన్ ఖాన్ ముగ్గురు రాజ కుమారులకు మంచి మిత్రుడు) రుస్తుం ఖాన్ యొక్క దుర్మార్గ పూరిత ఆలోచన తెలియని రాగమ్మ గారు అమాయకంగా అనాలోచితంగా ముగ్గురు నీ రుస్తుం ఖాన్ దగ్గరకి ఎటువంటి సైన్యం లేకుండా పపించింది. రుస్తుం ఖాన్ వారిని సాదరంగా తన డేరాలోకి పిలిపించి అత్యంత ప్రేమ నటిస్తూ సలసల మరిగే నూనె ను జొన్న వెన్నులలో పోయించి వీపుల మీద కొట్టించి అత్ కిరాతకం గా హతమార్చెను ( చనిపోయే నాటికి రాగమ్మ గారి పెద్ద కొడుకైన తిమ్మరాజ జగపతి కి 34 సంవత్సరాలు మరియు ఏడాది వయస్సున్న బాలుడు కలడు)
రుస్తుం ఖాన్ పెద్దాపురం కోటని ఆక్రమించు కోవడానికి వస్తున్న వార్తని వేగులు(గూఢ చారులు) ద్వారా తెలుసుకున్న రాగమ్మ గారు. తురుష్కుల భారిన పడకూడదని (తురుష్కులు అంతపుర స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారు మహారాణులను వివస్త్రలు చేసి వీధుల వెంబడి ఊరేగించేవారు. అంతపుర కాంతలపై హత్యాచారాలకు తెగబడి అతి కిరాతకంగా వేధించి చంపేసేవారు) అందుచేత ఏడాది వయసున్న బాలుడు జగపతి ని కోట దాటించి విజయనగరం పంపించే ఏర్పాట్లు చేసి కోట గేట్లు మూయించేసారు.
సంస్థాన సేవకులలో అత్యంత విశ్వాస పాత్రుడైన చల్లా పెద్ది ని అంతపురానికి నిప్పు పెట్టమని ఆజ్ఞాపించి మొదట తానే అగ్నికి ప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసుకుంది ఆమె వెంట అంతపుర స్త్రీలందరూ అగ్నికి ఆహుతయ్యారు.
మీ వంగలపూడి శివకృష్ణ

Thursday, 3 December 2015

పెద్దాపురం చరిత్ర పద్యం - Poem on Peddapuram History


పెద్దాపురం చరిత్ర పద్యం 


-------------------------------
అయ్యా వినండి ఘన చరితం 
పెద్దపురమను మన చరితం 
సూర్య వంశోద్భావులు ఆంధ్ర క్షత్రియులు 
దుర్జయుడే మా మూల పురుషుడు 

పెదపాత్రుడు మా పెద్దయ్య 
నిర్మిచెను మా నగరమయా 

కృష్ణా జిల్లా కాండ్రపాడు లో
కొలువు దీరెను కోటకట్టుకుని 
గుడిమెట్టలోన గుఱ్ఱము తోడ్కొని 
భీమ కవీషుని శాపము గైకొని
స్వర్గము కేగిన సాగి పోతన్న 
మా పూర్వులలో ఒకడన్న

తెలుంగు రాయుడు తెగువ చూపెను 
భీమ కవీశుడే చెలిమి చేసెను 
వరాహ వధను విరమణ చేసి 
నృశింహ పురాణమంకితమిచ్చెను

వీరి మనుమడే రామరాజన్న 
రాజథానేమో వత్సవాయన్న
రాజ శేఖరుల మనోభీష్టమున
రాజధానాయె గృహనామం

పరిసరమందలి పాలకుల ద్రోలి 
పెద్దాపురమున కోటగట్టిన
తిమ్మ శిఖామణి తేజరిల్లెను
షేరు మహమ్మదు ఛత్రమునొంది

రాజాధి రాజు రమ్య బిరుదాశాలి
రాయరాజపరాజు రాజ జగపతి రాజు 
గెలిచే అవలీలగా చాల ధుర్గాలు
నీరాజనాలిచ్చే నానా నవాబులు

సార్వభౌమ తిమ్మ యుద్ధపటిమ 
ధుగరాజు మొదలైన దొరల భంగించి 
విశ్వంభరుని జేసె యుద్దవిరతు

జాపరల్లి వింధ్యగిరినవశేషమున్ చేయ
వెంకాంబ కుమరుండు ఉద్భవించేను   
ఘనరాజ మండలనిరోధమ్ము చేసి 
ఉద్దండ రాయుడై ఉద్ధరించేను  

మైనరాయెను గనుక
ముగ్గురు కుమారులు 
తిమ్మ జగపతి పేర
రాజ్య పాలన చేసే రాఘవమ్మ

రుస్తుం ఖానుండి కపటోపాయం
వత్సవాయ వంశమునకపాయం 
అంతః పుర స్త్రీలగ్నికి ఆహుతి 
బాల జగపతికి జైలు దుర్గతి 

విజయనగరపు రాజు విజయరామ రాజు 
అందించే తోడ్పాటు అవసరముగా 
హాజీ హుస్సేను హతాసుడాయెను
నూరుద్దీన్ ఖాన్ నెత్తురొడ్డేను 

బాల జగపతే రాజ జగపతై 
పాలించే పురమును జనరంజకముగా

విధ్వత్తిమ్మపతి విధ్వత్తు తోడ
సంస్థాన పాలనము చక్కగాను

మలి రాయ జగపతి పొందే సన్నద్దు 
ఇంగ్లీషు కుంఫిణీ ఇష్ట కార్యార్ధం

లేక కుమారులు రాయ జగపతికి నాడు 
కుంఫిణీ రగిలించే కుంపట్లు కొలువులో 

జగన్నాధ రాజడిగె రాజ్యాధికారం 
లక్ష్మీ నరసాయమ్మ తెలిపే ధిక్కారం

బంగారు మా తల్లి బుచ్చి సీతాయమ్మ 
అన్న సత్రాలెన్నో కట్టించె ఆశువుగా   
త్రవ్వించె తటాకము తెలివి తోడ
నేటికీ నిలెచెనవి 

రాయ జగపతి వర్మ రచియించె రుచిగా 
పెద్దాపుర సంస్థాన చరితమిదియె 

బ్రిటీషు కుంఫిణీ కంపు కార్యాలతో
రాజ్యాల రాజసం అంతరించేను
జమీను దారుల జల్సాల లోను 
మేజువాణీల మోజు రివాజై 
రోజు రోజుకీ జారిపోయెను 
పెద్దాపురమే మారిపోయెను
ప్రతిభా వంతులు పేరు చెప్పక 
ప్రగతి అన్నదే పారిపోయెను

కళలకు నెలవగు కళావంతులు 
కత్తికి కట్టి పసుపు భాసికం
అంగడి వేలం కన్నెరికం
అతివ బతుకు ఇహలోక నరకం


వందేళ్ళ ఘన చరిత మున్సిపాలిటీ 
వేశ్యాపురమన్న పాప్యులారిటీ 
రాజకీయ నాయకుల  కోతలు
రికార్డు డాన్సుల మోతలు 

కోటేశ్వరరావు గారి క్లారిటీ
బచ్చు ఫౌండేషన్ వారి చారిటీ 
ముప్పన వారిది హైస్కూలు 
బ్రిటీషు వారిది ఒక స్కూలు 
బచ్చు వారిదే ప్రతి అభివృద్ధి 

చేయలేదయ్యా సర్కారు మీరేదీ 
పేరుకి పెద్దది మా డివిజన్ 
ఏదయ్యా తమరి విజన్


గల్లీలన్నీ ఆట స్థలాలే 
క్రీడాస్పూర్తే క్షీణిస్తే 
యువత పరిస్థితి అధోగతే

పరిశుబ్రత పదమే కరవు
రోగాలకు ఆకరువు 
రోగులు వేలు - పడకలు పదులే 
ఏరియా ఆస్పత్రి అసలు స్థితి

అయ్యో ఆదిత్యా రోడ్డు 
మృత్యువుతో బేటీ ఫ్రెండు 
పాండవుల మెట్ట పాపముల పుట్ట 
సూర్య భగవానుడే సాక్షీ భూతం

మరిడి మాతల్లి మౌనమే మళ్ళీ
ప్రజా పంపిణీ - మోసాల కుంఫిణీ
లేదు ఏ రేషన్ - అంతా పరేషాన్ 
దొరికితే 6A కేసు - లేకుంటే నువ్వే బాసు 
విలేకర్లకూ వాటా ఉందోయ్

వీధికో సంఘం, గృహముకో గ్రూపు 
ఆ సంఘం ఈ సంఘం 
ఆ ఇజం ఈ ఇజం  
అన్ని ఇజాల నిజానిజాలు 
పోట్టకూటికే  ప్రతి సంఘం 
పేరుకి మాత్రం రణరంగం

కట్టమూరు లో బట్టీ సారాయి 
ఖాకీలకు నేతి మిఠాయి 

ఏనుగు లచ్చన్న 
వేదుల  సత్తన్న 
వీర్రాజు ముప్పన 
యాసలపు సూరన్న 
మళ్ళీ పుట్టండన్న మన పెద్దాపురమున 

వీర రాఘవమ్మ 
లక్ష్మీ నరసాయమ్మ 
 బుచ్చి సీతాయమ్మ 
పెద్దాడ కామమ్మ 
మమ్ము నడపండమ్మ 

వర్ణ చిత్రపు వెలుగు వాడిపోయేను 
తోలుబొమ్మల కదలిక ఆగిపోయేను 
సాముగరిడీ సచ్చి పోయేకదరా 
దౌర్భాగ్య నాయకా చావవేమిరా


పెండలమనేటి పంటే మాయం 
మెట్టలు మాయం గుట్టలు మాయం 
మరుభూమి మాయం - మాయం 
ఛీ .. మరుగు దొడ్దిలు ఖబ్జాలేనా ... ?

మర్లాం టు పెద్దాపురము 
స్కూలు చేరగా చిన్న పిల్లలు - 
తొక్కి సైకిలు పదిమైళ్ళు 
తొక్కి తొక్కి తొడ తుక్కై పోయి 
వెక్కి ఎడ్చుతూ అడిగే నేరుగా 

ఏదీ మా బస్సు పల్లెకు 
ఏంటి మీ స్టాండు చివరకు 
మా బ్రతుకాయెను బస్టాండు
బస్టాండాయెను భోగం బజారు

ఊరంతా పెద్దలే
ఊరినిండా పేదలే

Friday, 27 November 2015

కాండ్ర కోట నూకాలమ్మ అమ్మవారు KANDRAKOTA NOOKALAMMA THALLI CHARITRA - PEDDAPRUAM

మన పెద్దాపురం లోని కాండ్ర కోటని కన్నులారా చూతము రారండి





పెద్దాపురం నుంచి 7 కిలోమీటర్లు (గుడివాడ, సిరివాడ ల మీదుగా స్వచ్చమైన పల్లెటూరి వాతావరం దారి పొడవునా రోడ్దుకిరువైపులా చెట్లు, చెట్లకి అవతల పచ్చని పంట పొలాలు..... వ్యవసాయానికి ఇప్పటికీ వాడుతున్న ఎద్దులు, రవాణాకి వాడుతున్న ఎద్దుల బండ్లు. వూరి మద్యలో రామాలయం - రామకోవెల (రాంకోలు) మీద అష్టా చమ్మా ఆడుతూ పిల్లలు ... దృశ్య శ్రవణ యంత్రం (టెలివిజన్ - టివి ) వీక్షిస్తున్న వృద్దులు, పెద్దలు... ఊరంతా కల్మషం లేని మనుసులు.ఆ మనుషులని కంటికి రెప్ప లా కాపాడే నూకాలమ్మ అమ్మవారు) వెరసి కనీసం ఒక్కసారైనా కాండ్రకోట ని కన్నులారా చూడవలసిందే ....................



కొన్నివేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని కిమ్మెర అనే స్వార్ధపరుడైన రాజు పరిపాలిస్తూ ప్రజలను రాక్షసంగా అనేక చిత్ర హింసలకు గురిచేసేవాడట అతను పెట్టె కష్టాలను ఓర్చలేక ప్రజలు సమీపం లో ఉన్న మరొక ధర్మాత్ముడైన మహా రాజు ధర్మకేతు ని ఆశ్రయించి రాక్షస రాజు కిమ్మెర బారి నుండి తమను రక్షించమని వేడుకొన్నారట అంతట ధర్మకేతు మహారాజు ప్రజా సంరక్షణార్ధం కిమ్మేరుని పై యుద్ధం చేసి దురధుష్టవసాత్తూ ఆ భీకర యుద్ధం లో ఓడిపోయారట !


ఆతని ఓటమి తరువాత ప్రజలపై కిమ్మేరుని పైశాచిక చర్యలు పెచ్చుమీరాయంట (అధికమయ్యాయి) ! ప్రజల యొక్క అవస్థలను చూసి సహించలేని ధర్మకేతు మహారాజు ఎలాగైనా కిమ్మెరుని వధించాలని ఆదిపరాశక్తి ని అంకుఠిత దీక్షతో ప్రార్ధించాడట. ఆతని తపస్సుకి మెచ్చి ఆది పరాశక్తి అమ్మవారు ప్రత్యక్షమై ఆమె అంశ ల లోని ఒక అంశ ను ధర్మకేతు మహారాజు తో పాటూ పంపిందట. ఆ యొక్క అంశ సహాయంతో ధర్మకేతు మహారాజు - స్వార్ధపరుడు, రాక్షస రాజైన కిమ్మెరుని ఓడించి - వధించి ప్రజలను కష్టాలనుంచి విముక్తులి చేసి రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడట

ఆ ఆది పరాశక్తి అంశే "నూకాలమ్మ అమ్మవారు" యుద్ధంలో అతని విజయానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ధర్మకేతు మహారాజు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఆ ప్రాంతంలో ఆలయం నిర్మించినాడు -

అప్పటినుంచి శ్రీ నూకాలమ్మ వారు ఆ రాజ్య దేవతగా ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా కాపాడే కాండ్రకోట నూకాలమ్మ గా ... కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా కొలువు తీరినారు .

పాల్గుణ మాస బహుళ చతుర్దశి రోజున ప్రారంభమై 41 రోజులు అంగరంగ వైభవం గా కన్నుల పండుగ గా జరిగే ఈ జాతరకి ఆంద్రప్రదేశ్ నలుమూలల నుంచి ప్రజలు తండోప తండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరియిస్తారు.


జాతర సమయంలో గ్రామస్తుల తో పాటుగా శ్రీ గీతా శివభక్త యువజన సంఘం దేవాలయ సందర్శకులకు - చిన్నపిల్లలకు విశిష్ట సేవలు అందించడం అబినందనీయం. బచ్చు ఫౌండేషన్ వారు కాండ్రకోట గ్రామాన్ని గ్రామంలోని విద్యాలయాలను అభి వృద్ధిపరచిన తీరు బహు ప్రశంసనీయం.



ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని సందర్శించాలని ఆశిస్తూ 
మీ వంగలపూడి శివకృష్ణ

ఏనుగు లక్ష్మణ కవి ENUGU LAXMANA KAVI - PEDDAPURAM

మన పెద్దాపురం : ఏనుగు లక్ష్మణ కవి

--------------------------------------------------------------------------------------

ఏనుగు లక్ష్మణ కవి గారు జన్మస్దలము పెద్దాపురము (ప్రస్తుత తూర్పుగోదావరిజిల్లాలోని సామర్లకోటకు దగ్గరులో వున్నది)

ఈయన క్రీ.శ.18 వ శతాబ్దికి (1797)చెందిన వారు.
ఏనుగు లక్ష్మణ కవి గారి తల్లిగారి పేరు పేరమాంబ, మరియు తండ్రిగారి పేరుతిమ్మకవి.

శ్రీ లక్ష్మణ కవి గారి ముత్తాతగారు"శ్రీ పైడిపాటి జలపాలామాత్యుడు".ఈయన ఒక ఏనుగును పోషించెవాడు.దానిని ఈయనకు పెద్దాపురం సంస్థాన పాలకులు బహుమతిగా యిచ్చారు.

అందుచే కాలక్రమేన వీరి యింటిపేరు ఏనుగు వారిగా స్దిరపడినది.
శ్రీ వత్యవాయ తిమ్మజగపతి పాలకుని వద్ద వున్న ప్రసిద్ద కవి'కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మకవి, లక్ష్మణ కవి గారి సమ కాలికుడు. లక్ష్మణ కవి గారు, భర్తృహరి సంస్కృతంలో రచించిన "సుభాషిత త్రి శతిని" తెలుగులోనికి "సుభాషిరత్నావళి" పేరు మీదఅనువాదం చేసినాడు.
సుభాషిరత్నావళి నీతి, శృంగార, వైరాగ్య శతకములని మూడు భాగములు.

భర్తృహరి సుభాషితములను తెలుగులోనికి అనువాదము చేసినవారు ముగ్గురు
1. ఏనుగు లక్ష్మణ కవి
2. పుష్పగిరి తిమ్మన
3. ఏలకూచి బాల సరస్వతి. వీటన్నింటిలోను మిక్కిలి ప్రజాదరణ పొంది అందరి నోళ్ళ్లలో నానినవి "ఏనుగు లక్ష్మణ కవి" అనువాదాలు.

ఏనుగు లక్ష్మణ కవి గారి భర్తృహరి సుభాషిత నుండి
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్.

ఏనుగు లక్ష్మణ కవి గారి యితర రచనలు
1.రామేశ్వర మహత్యము.
2.రామ విలాసం
3.సూర్య శతకము.
4.లక్ష్మీనరసింహ శతకము.
5.గంగా మాహాత్మ్యము

ఇట్లు మీ వంగలపూడి శివకృష్ణ

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...