మన పెద్దాపురం : గులాబీ అత్తరు కథ గుర్తుందా మిత్రులారా ... ?
ఎప్పుడో చదివిన కథ కదా మరిచిపోయి ఉంటారు పరవాలేదు నేనున్నాగా గుర్తుచేయడానికి "గులాబీ అత్తరు అనే ఆసక్తి కరమైన కధ" శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు రచించిన చిన్నకథలు నుండి గ్రహించబడిన కథ
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు వడ్లగింజలు, కలుపు మొక్కలు, పుల్లంపేట జరీచీర లాంటి ఎన్నో ఆసక్తి కరమైన కధలు రచించారు ఆయన రచించిన ప్రతీ కదా అద్భుతమే ప్రతీ అక్షరం ఆణిముత్యమే అలాంటి కథల్లో "గులాబీ అత్తరు" కథ కూడా ఒక్కటి. ఇది అంత మంచి కధ కాబట్టే తెలుగు ఉపవాచకం లో పాఠ్యాంశం గా తీసుకోబడింది. ఇక కథ విషయంలోకి వెళ్తే... !
పెద్దాపురం సంస్థానంలో దివానుల యొక్క గర్వాతిశయానికి, ఆగ్రహావేశాలకు ప్రతిభ గల కళాకారులు ఎలా బలి అయ్యేవారో తెలియజేసే కథే ఈ "గులాబీ అత్తరు"
శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి బహద్దరు మహారాజు గారు పెద్దాపురాన్ని పరిపాలించే కాలంలో షుకూర్ అలీ ఖాన్ అనే అత్తరు వర్తకుడు ఢిల్లీ నుంచి పెద్దాపురం సంస్థానానికి వచ్చి తను ఎంతో వ్యయ ప్రయాశలకోర్చి తయారు చేసిన గులాబీ అత్తరును రాజుకు సమర్పించి సన్మానం పొందాలనుకుంటాడు. ఆరోజుల్లో మహారాజా సందర్శనం అంటే మాటలు కాదు. రాజుగారి సందర్శనం కోసం ఎవరెవర్ని కలవాలో అందర్నీ కలుసుకుంటూ కలిసిన వారందరికీ అతను తెచ్చిన అత్తరు వాసన చూపిస్తూ తాను వచ్చిన విషయం చెప్పుకుంటూ రాజుగారిని కలవడంలో ఆఖరి అడ్డంకి అయిన దివాన్జీ ఇంటికి చేరుకుంటాడు మన అలీ ఖాన్ , అతని లాంటి ఖాన్లు, డాన్లు ఎందరో అక్కడ దివాన్జీ గారి కోసం వరుసలో నిలబడి ఉంటారు. ఖాను తన అత్తరు వాసనను దివాన్జీకి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో తన దగ్గరున్న ఒక అత్తరు సీసా మూత తీసి వెంటనే బిగిస్తాడు. ఆ వాసన క్షణాల్లోని ఆ ప్రాంతం అంతా వ్యాపిస్తుంది. అక్కడున్న పరివారం, ఠాణేదారు, పెద్దమనుషులు మత్తుతో తుళ్లిపోతారు. కానీ ఆవాసన పీల్చిన దివాన్జీ మాత్రం ' ఏమిటీ కంపు..' అని అడుగుతాడు. ఆ మాటతో ఢిల్లీ నుంచి వచ్చిన అలీ ఖానుకు తల కొట్టేసినట్లు అవుతుంది. గోలకొండ నవాబును సైతం మంత్ర ముగ్ధుణ్ణి చేసిన అతని అత్తరు వాసన. పెద్దాపురంలో దివాన్జీ కంపుగా భావించడం చూసి అలీ ఖాను కలత చెందుతాడు. కాసేపటి తర్వాత షాక్ నుండి తేరుకుని దివాన్జీ దగ్గరకు వెళ్తాడు. కానీ దివాన్జీ - ' దివాణంలోకి అంగడి సరుకు తెస్తావా ...' ఎవడ్రా నువ్వు అంటూ కోపపడతాడు, దివాన్జీకి సన్నిహితులైన శాస్త్రులు, జవాను, ఠాణేదారు కొంత సర్ది చెప్పడంతో దివాన్జీ మామూలుగా మాట్లాడతాడు. కానీ అతని ప్రతి మాటలో అహంకారం, అధికార మదం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయినా అలీ ఖాను ఓపికగా తను తయారుచేసి తీసుకొచ్చిన మల్లె అత్తరు గురించి చెప్తాడు. అలాగే ఎంతో కష్టపడి కాశ్మీరీ గులాబీలతో పెద్దాపురం మహారాజా వారి కోసమే "గులాబీ అత్తరు" తయారు చేశానని మీరు అనుమతిస్తే మహారాజా వారికి సమర్పిస్తానని ఈ అత్తరు మహారాజా వారికి బాగా నచ్చుతుందని. ఢిల్లీలో గోలకొండ, పెద్దాపురం సంస్థానాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని, గోలకొండ నవాబు గారు కూడా తన అత్తరు పరిమళానికి ఆశర్యపోయి ఎంతో మెచ్చుకున్నాడని చెప్తాడు. అంతా వివరంగా విన్న దివాన్జీ మాత్రం వ్యంగ్యంగా 'ఎంతకి కిట్టింది పాపం' అని అడుగుతాడు. దాంతో అలీ ఖాను కళాహృదయం దెబ్బతింటుంది. బాధను హృదయంలోనే అణచుకొని అయ్యా దివాన్జీ సాబ్ 'రాజుగారు సరసులని విన్నాం వారి దర్శన భాగ్యం కల్పించండి' అని బ్రతిమా లాడుకుంటాడు. కానీ దివాన్జీ మాత్రం 'మేము వారి భృత్యులం, మాకు కొన్ని విధులు ఉంటాయి. ఢిల్లీలో ఎవరన్నా వజీర్లు ఏదైనా వస్తువు తెస్తే దాని మంచి చెడ్డలు తెలియకుండా పాదుషా సన్నిధికి ఉంచనిస్తారా' అంటూ కోపంగా ప్రశ్నిస్తాడు, దివాన్జీ కఠినమైన మాటలకు అలీ ఖాను కలవరపడతాడు పెద్దమనుషులు, ఠాణేదారు అత్తరు తెచ్చిన అలీ ఖానుకు సర్దిచెప్పి తర్వాత కలువు అని చెప్పి పంపించేస్తారు. ఆ రాత్రి అంతా అలీ ఖానుకు నిద్రపట్టదు. తను డబ్బుకోసం ఈ అత్తరు తయారు చేయలేదు. కళాకారుల కళకు డబ్బుతో వెలకడతారా.. అసలు ముక్కు మొగమూ తెలియని చోటుకు రావడం తనదే తప్పు.. అసలు సన్మానం మాట దెవుడెరుగు మర్యాదగానైనా ఇక్కడ నుండి వెల్లగలనా.. అని బాధపడతాడు. తెల్లవారి ఠాణేదారు షుకూర్ అలీ ఖాన్ ను పిలిచి నువ్వు ఒక సాహసం చెయ్యగలవా అని అడిగి, మహా రాజుగారు రేపు ఉదయాన్నే కోటలోకి సపరివార సమేతం గా ప్రవేశిస్తారు. నువ్వు మాత్రం ఆయన 'కోట ప్రాకారం దాటకుండానే వారికి కనబడాలి, లేదా నీ వట్టివేళ్ల అత్తరు వాసనైనా అతనిని ఆకర్షించాలి' అని సలహా ఇస్తాడు. ఖాను సిపాయిలు అడ్డగించినా వారికి నచ్చజెప్పలేక నానా యుక్తులు పన్నుతూ వారితో మాట్లాడుతూ కాల యాపన చేస్తూ ఉంటాడు. కానీ దివాన్జీ, రాజుల దర్శనం దొరకదు. సిపాయిలు ఎంత చెప్పినా వారిని అటకాయిస్తూనే ప్రాంగణాన్ని దాటకుండా నిలబడతాడు. అంతలో రాజుకోసం వచ్చే పెద్దమనుషులు, చదరంగం సహచరులు అందరూ అక్కడే గుమిగూడతారు. చివరకు రాజు వచ్చే సమయం సమీపించడంతో సిపాయిలు అతడ్ని అక్కడ నుంచి పంపడానికి ప్రయత్నం చేస్తారు.
మహారాజు గారి రాకని గమనించిన ఆలీ ఖాను ' పెద్దాపురం రాజ్యంలో కళాకారులకిదా సన్మానం అంటూ..' ఆవేశంతో మాట్లాడుతాడు. కోపంతో కళ్లు ఎర్రబడి, శరీరం వొణికిపోతుంటాయి. "గులాబీ అత్తరు" సీసాను చేతిలోకి తీసుకొని 'పెద్దాపురం ప్రభువుకోసం నిద్రాహారాలు మాని ఈ "గులాబీ అత్తరుని" తయారు చేశాను. అటు గోలకొండ ఉత్తర భారత దేశంలో, ఇటు పెద్దాపురం దక్షిణ భారతదేశంలో నాపేరు నిలిచిపోతుందని పేరాశ పడ్డాను. గుళాబీ పువ్వు పరిమళం ఎంత దూరమైనా వ్యాపిస్తుంది. కానీ ముళ్ల ప్రభావం ఉన్నచోటనే వెల్లడి కాదు... దీనిని మహారాజుకు అందించడానికి నాకు మార్గాలు లేవు. నాకు, నా కుటుంబానికి ఇది శిరచ్ఛేదనతో సమానం' అని సీసాను కోటగోడకు విసిరికొడతాడు. సీసా భళ్లుమంటూ పగిలిపోతుంది. పెంకులు ఘళ్లుమంటాయి. ఆ వాసనకు అక్కడున్న వారందరూ మత్తెక్కిపోతారు. ఆ మత్తు నుంచి కోలుకుని అలీ ఖానును చూసే సరికి అతను కొయ్యబారి పోయి ఉంటాడు. పంచకళ్యాణి మీద వస్తున్న రాజు ఆ పరిమళానికి సొక్కి పోయి ఉంటాడు. గుర్రం మాత్రం ఊపిరి తీసుకుంటుూ కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ "గులాబీ అత్తరు" పరిమళం పెద్దాపురంలో గుబాళిస్తూనే ఉంటుంది అంటూ శ్రీపాద వారు ఈ కథను ముగిస్తారు.
గులాబీ అని పడటానికి బదులు చాలాచోట్ల గుళాబీ అని పడింది సరిదిద్దగలరు.
ReplyDelete